Gold: ఈ ఏడాది ఇప్పటివరకు పసిడి ధరలు ఎంతగా పెరిగాయో తెలుసా? అయినా భారీగా ఎందుకు కొంటున్నారంటే?
కొన్ని దశాబ్దాల కిందట బంగారం ధర తక్కువగా ఉండేది, కానీ ప్రస్తుతం దాని విలువ చాలా పెరిగింది.

బంగారం ధరలు ఈ ఏడాది కేవలం రెండు నెలల కాల వ్యవధిలోనే ఇప్పటివరకు 12 శాతం కంటే అధికంగా పెరిగాయి. దీంతో పసిడి ధరలు ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరుకునే దిశగా పరుగులు తీస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక ఆర్థిక సంక్షోభం కారణంగా పెట్టుబడిదారులు విలువైన లోహమైన బంగారం వైపు ఇన్వెస్ట్ చేస్తున్నారని బ్రూక్‌విల్లే క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సైమన్ పాపుల్ తెలిపారు.
“ఇప్పటివరకు మనం ఆర్థిక స్థిరత్వం అధికంగా ఉన్న పరిస్థితుల మధ్యే జీవించాం, కానీ, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మాత్రం ఆ స్థిరత్వం ఇక ఉండదని అనిపిస్తోంది” అని పాపుల్ ప్రముఖ వెబ్ సైట్ ‘యూరోన్యూస్’కు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని దేశాలపై టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. దిగుమతి చేసే వస్తువులపై అదనపు పన్నులు వేయడం వల్ల వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావంగా, ఈ సుంకాలు భరించాల్సిన దేశాలు కూడా ప్రతీకారంగా అమెరికా ఉత్పత్తులపై అదనపు పన్నులు విధించవచ్చు.
దీనివల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితి పెరుగుతుంది. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు బంగారం వంటి విలువైన లోహాల వైపు మొగ్గు చూపుతున్నారు.కాబట్టి పర్యవసానంగా బంగారం రేట్లు పెరుతుతాయి.
అర్థికంగా అనిశ్చితి ఉన్న కాలాల్లో, బంగారం విలువైన పెట్టుబడిగా మారుతుంది. ఎందుకంటే, ఈ సమయంలో స్టాక్ మార్కెట్లు పడిపోవచ్చు, కరెన్సీల విలువ తగ్గిపోవచ్చు, కానీ బంగారం విలువ మాత్రం స్థిరంగా ఉండే అవకాశం ఎక్కువ.
ఉదాహరణకు, ముద్రణను ఎక్కువగా పెంచడం వల్ల ఓ దేశ కరెన్సీ విలువ తగ్గిపోతే, ఆ కరెన్సీలో ఉన్న ఆస్తుల విలువ కూడా తగ్గిపోతుంది. కానీ బంగారం మాత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విలువైన లోహం కాబట్టి, దాని విలువ పెద్దగా మారదు.
కాబట్టి, ఆర్థిక మాంద్యం, అంతర్జాతీయ రాజకీయం, యుద్ధాలు లేదా ద్రవ్యోల్బణం వంటి అస్థిర పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. దీనివల్ల బంగారం ధరలు పెరగవచ్చు. అందుకే బంగారాన్ని “పెట్టుబడులకు స్వర్గధామం” అని అంటారు.
అయితే, చారిత్రాత్మకంగా చూస్తే, బంగారం దాని విలువను చాలాకాలం పాటు నిలబెట్టుకుంటూ వచ్చింది. దీని వెనుక ప్రధాన కారణం బంగారం పరిమితమైన వనరు కావడం, అలాగే మార్కెట్లో బంగారం దాని డిమాండ్ ను ఎప్పుడు కూడా కోల్పోలేదు.
ఉదాహరణకు, కొన్ని దశాబ్దాల కిందట బంగారం ధర తక్కువగా ఉండేది, కానీ ప్రస్తుతం దాని విలువ చాలా పెరిగింది. దీని అర్థం ఏమిటంటే, దీర్ఘకాలంలో బంగారం తన కొనుగోలు శక్తిని కోల్పోకోకుండా.. పెంచుకుంది. కాబట్టి, పొదుపు లేదా పెట్టుబడి కోసం దీర్ఘకాల ప్రణాళికలో బంగారం పై ప్రజలు తమ స్థాయికి తగ్గట్లుగా ఇన్వెస్ట్ చేస్తున్నారని పాపుల్ వివరించారు.