Gold prices: మొట్టమొదటిసారి ఈ మార్కును దాటిన బంగారం ధరలు.. మీరు కొంటున్నారా?
ఇప్పుడు అందరి దృష్టి వచ్చే బుధవారం జరగనున్న ఫెడ్ రిజర్వ్ సమావేశంపై ఉంది.

అంతర్జాతీయంగా బంగారం ధరలు శుక్రవారం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మొదటిసారి ఔన్స్‌కు 3,000 డాలర్లను మించి ధరలు రికార్డయ్యాయి. అమెరికా టారిఫ్‌లపై అనిశ్చితి, వాణిజ్య ఉద్రిక్తతలపై భయాలు, అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండటంతో ఇవాళ అంతర్జాతీయంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
బంగారం ధరలు ఇవాళ 3,000 డాలర్లను మించిపోతాయని గురువారమే విశ్లేషకులు ఊహించారు. ఎలాగంటే, గురువారం స్పాట్ గోల్డ్ ధర 0.1% తగ్గి 2,983.78 డాలర్లకు చేరింది.
అయినప్పటికీ, ట్రేడింగ్ సమయంలో 2,990.09 డాలర్ల గరిష్ఠ స్థాయిని తాకి, 3,000 డాలర్ల మార్క్‌కు మరింత దగ్గరగా వచ్చింది. ఈ వారం బంగారం ధరల్లో మొత్తం 2.5% పెరుగుదల కనిపిస్తోంది. అలాగే యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2% పెరిగి 2,996.70 డాలర్లకు చేరాయి.
ట్రంప్ హెచ్చరికల వేళ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా వాణిజ్య నిర్ణయాల అనంతరం.. అమెరికా స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ కూడా 50% టారిఫ్ విధించింది. దీనికి ప్రతిగా యూరోపియన్ వైన్, స్పిరిట్స్‌పై 200% టారిఫ్ విధిస్తానని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ యాప్‌లో హెచ్చరించారు.
ట్రంప్ నిర్ణయాలు ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితిని పెంచే అవకాశం ఉండడంతో 2025లో బంగారం పలుసార్లు రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు అందరి దృష్టి వచ్చే బుధవారం జరగనున్న ఫెడ్ రిజర్వ్ సమావేశంపై ఉంది. ప్రస్తుతం వడ్డీ రేటును 4.25% నుంచి 4.50% శ్రేణిలో కొనసాగించే అవకాశం ఉంది. సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లు విధిస్తే బంగారం ధర పెరుగుతుందని తెలిసిన విషయమే.
వాణిజ్య వివాదాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు అస్థిరత భయాలతో బంగారాన్ని సురక్షిత ఆస్తిగా భావిస్తున్నారు. ఐజీ మార్కెట్ స్ట్రాటజిస్ట్ యీప్ జూన్ రోంగ్ తెలిపిన వివరాల ప్రకారం.. వాణిజ్య వివాదాలు రెండవ త్రైమాసికంలో మరింత పెరిగే అవకాశం ఉండటంతో బంగారాన్ని నమ్మకమైన పెట్టుబడిగా పెట్టుబడిదారులకు భావిస్తున్నారు.
ఇక రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి.. అమెరికా చేసిన 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనలకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించిన సంగతి తెలిసిందే. దానిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం ఒక కీలక ప్రకటన చేశారు. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణపై రష్యా సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, కొన్ని నిబంధనలు, స్పష్టతలు అవసరమని తెలిపారు. దీంతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.