Gold Price: వచ్చే ఏడాది బంగారం ధర భారీగా పెరగబోతుందా.. అందుకు కారణాలు ఏమిటంటే?
దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత నెల ప్రారంభంలో తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం మళ్లీ పుంజుకున్నాయి.

Gold
Gold And Silver Price: దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత నెల ప్రారంభంలో తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం మళ్లీ పుంజుకున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలంటేనే మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మరో బ్యాడ్ న్యూస్ ఏమిటంటే.. బంగారం ధరల పెరుగుదల ఇక్కడితో ఆగదట. వచ్చే ఏడాది వీటి ధరలు రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ, పెట్టుబడుల సేవల సంస్థ అయిన గోల్డ్ మ్యాన్ శాక్స్ అంచనా వేసింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో 2,650 నుంచి 2,700 డాలర్ల స్థాయిలో కదలాడుతోంది. అయితే, వచ్చే ఏడాది ఈ ధర భారీగా పెరుగుతుందని గోల్డ్ మ్యాన్ శాక్స్ అంచనా వేసింది. వచ్చే ఏడాది చివరి నాటికి ఔన్సు బంగారం ధర 3,150 డాలర్లకు (1డాలర్ రూ.84,44) చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. బంగారం భారీగా పెరగడానికి అనేక కారణాలను సంస్థ పేర్కొంది. ముఖ్యంగా వివిధ దేశాల మధ్య ఉధ్రిక్తతలు, యుద్ధాలు పసిడి ధర పెరగడానికి ప్రధాన కారణం కాగా.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కొన్ని దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకోవడమూ ధర పెరిగేందుకు దోహద పడుతున్నాయని గోల్డ్ మ్యాన్ శాక్స్ సంస్థ అంచనా వేసింది.
ప్రస్తుతం ఔన్సు బంగారం అంతర్జాతీయ మార్కెట్ లో 2,650 డాలర్ల స్థాయిలో ఉంది. భారత దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 77,990 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ. 71,490గా నమోదైంది. అయితే, దీర్ఘకాలంలో మాత్రం ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు యూబీఎస్ అంచనాల ప్రకారం.. ఔన్సు బంగారం ధర వచ్చే నెలలో 2,900 డాలర్లకు, వచ్చే ఏడాది చివరి నాటికి 3,000 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం ధరల కంటే బంగారం ధరలు తగ్గే అవకాశం చాలా తక్కువ అని, భారీగా ధరలు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని యూబీఎస్ అంచనా వేసింది. మొత్తానికి రాబోయే కాలంలో మధ్య తరగతి ప్రజలకు బంగారం కొనుగోలు చేయటం మరింత భారం కానుంది.