H-1B వీసాలపై అమెరికా కొరడా : చిక్కుల్లో ఐటీ సంస్థలు

అమెరికా వలస వ్యతిరేక సంస్కరణల్లో భాగంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం H-1B వీసాల జారీపై కఠినంగా వ్యవహరిస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన అన్ని తాజా H-1B వీసా దరఖాస్తులను తిరస్కరించింది. కనీసం 25శాతం వరకు హెచ్-1బీ వీసా దరఖాస్తులను ట్రంప్ ప్రభుత్వం తిరస్కరించింది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ప్రకారం.. యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ఆర్థిక సంవత్సరం FY15కంటే FY19లోనే అత్యధికంగా H-1B వీసా దరఖాస్తులను తిరస్కరించినట్టు తెలిపింది.
దీని కారణంగా భారతీయ టెక్ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికా కొత్త వలసల నియంత్రణ చట్టం కారణంగా H-1B వీసా దరఖాస్తులపై సర్వీసులు అందించే యూఎస్ ఆధారిత క్లయింట్లకు కళ్లెం పడింది. 2019 ఏడాదిలో మూడో త్రైమాసికంలో (అక్టోబర్ నుంచి జూన్) మధ్యకాలంలో హెచ్1బీ వీసా దరఖాస్తులను నాల్గోసారి తిరస్కరణకు గురయ్యాయి.
H-1B వీసా దరఖాస్తుల తిరస్కరణ రేటింగ్ అధికంగా పెరగడానికి USCIS మార్చిన కొత్త చట్టం లేదా కొత్త నిబంధనలతో కూడిన ప్రమాణాలే ప్రధాన కారణమని యూఎస్ అధికారిక వర్గాలు తెలిపాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనలో అనుమతి ఇచ్చిన జీవిత భాగస్వాముల H-1B వర్క్ పర్మిట్ హోల్డర్ వీసాలను కూడా రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
మరోవైపు హెచ్-1బి వీసా దరఖాస్తుల తిరస్కరణతో చాలా భారతీయ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను అమెరికా పంపించేందుకు ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అమెరికాలో పనిచేసేందుకు పంపే తమ కంపెనీ ఉద్యోగులకు సంబంధించి తాజా వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. కాంగిజెంట్ కంపెనీకి చెందిన ఎక్కువ వీసా దరఖాస్తులను అమెరికా తిరస్కరించింది. మిగతా కంపెనీల్లో క్యాప్ జెమినీ, అసెంచర్, విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడింది.
అమెరికాలో తమ కంపెనీ వర్క్ నిమిత్తం ఉద్యోగులను పంపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తద్వారా కంపెనీల వ్యాపారంపై ప్రభావం పడుతోంది. అందిన రిపోర్టు ప్రకారం.. 2018లో టాప్ ఆరు భారతీయ కంపెనీలకు చెందిన ఉద్యోగులు (2,145) H-1B వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. అమెజాన్ కంపెనీలో మాత్రం 2,399మంది ఉద్యోగులకు వీసా దరఖాస్తులకు ఆమోదం లభించింది.