వారసత్వమా? రసీదు ఉందా? : పాత బంగారం లెక్క ఎలా తేలుస్తారు?

  • Published By: sreehari ,Published On : October 30, 2019 / 10:38 AM IST
వారసత్వమా? రసీదు ఉందా? : పాత బంగారం లెక్క ఎలా తేలుస్తారు?

Updated On : October 30, 2019 / 10:38 AM IST

మీరు ఇంట్లో బంగారం దాచారా? అయితే లెక్క చెప్పాల్సిందే. రసీదు చూపించాల్సిందే. లేదంటే పన్ను కట్టాలి. చిన్న బంగారం ముక్క ఉన్నా లెక్క చెప్పాల్సిందే అంటోంది మోడీ ప్రభుత్వం. అక్రమంగా దాచుకున్న బంగారంపై పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయానికి తెర లేపింది. బంగారం ఎలా కొన్నారో లెక్క చెప్పాలంటూ కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకురాబోతోంది. బ్లాక్ మనీ తరహాలో బ్లాక్ గోల్డ్ కూడా బయటకు తీయాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నిర్ణయంతో ఎంత నల్ల బంగారం బయటపడుతుందో చూడాలి. వారసత్వంగా వచ్చిన బంగారానికి లెక్కలు లేవు. రసీదులు అంతకన్నా ఉండవు.

చాలామంది కట్నకానుకులా రూపంలోనూ, పెళ్లిళ్లు, ఫంక్షన్లో మా బంధువులు పెట్టారండీ బంగారం అని చెప్పినా తప్పించుకోలేరు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న ప్రతి బంగారానికి లెక్క చెప్పాల్సిందే అంటోంది కొత్త చట్టం. అక్రమంగా బంగారం కూడబెట్టిన వాళ్లూ కూడా తమకు వారసత్వంగా సంక్రమించాయంటూ చెప్పుకునే పరిస్థితులు లేకపోలేదు. పెద్దమొత్తంలో బంగారం కొన్నవారు తప్పనిసరిగా ఎక్కడ బంగారం కొన్నారో లెక్క చెప్పక తప్పదు..  రసీదులు కూడా చూపించాలి. లేదంటే కొన్న బంగారానికి ముక్కు పిండి పన్ను వసూలు చేయాలని చూస్తోంది ప్రభుత్వం. మరోవైపు మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయంతో మహిళల్లో గందరగోళం నెలకొంది.

మా పుస్తెల తాళ్లు కూడా తెంపుకు పోతారా అంటూ మహిళలు ఆందోళనకు గురియ్యే పరిస్థితి కనిపిస్తోంది. బంగారం జోలికి రారులే అనుకునే వారికి ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం చెంపపెట్టులా మారనుంది. నవంబరు 8వ తేదీన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నల్లడబ్బును మార్చేసి కిలోల బంగారం కొన్నవారిపైనే ప్రధానంగా ప్రభుత్వం దృష్టిపెడుతుందని, వారిపైనే చర్యలు తీసుకుంటామని అధికార పార్టీ నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. 

పాత బంగారమా? కొన్న కొత్త బంగారామా? తాత ముత్తాల నుంచి వారసత్వంగా వచ్చిందా? ఏదైనా సరే బంగారం ఉంటే లెక్క చెప్పాల్సిందే. నిజానికి బంగారం లెక్క తేల్చే విషయంలో విక్రయించిన బంగారం దుకాణాల మీద ఆధారపడటం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేదు. సాధారణంగా బంగారం దుకాణాల్లో 50వేలకు మించి జరిగే క్రయవిక్రయాల్లో పాన్ కార్డు ఇవ్వాలనే నిబంధన ఉంది. బంగారం వ్యాపారుల దగ్గర లెక్కల్లో లేని నల్ల బంగారం ములుగుతోంది.

పెళ్లిళ్లు.. ఫంక్షన్లకు ఒళ్లంతా కనిపించే బంగారం.. కేంద్రం నిర్ణయంతో ఇంట్లో నుంచి బయటకు తీయాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. బంగారం కనిపిస్తే ఎక్కడ లెక్క చెప్పమంటారోనని హడలి చస్తున్నారు. సాధారణంగా కొన్నబంగారంపై 3 శాతం జీఎస్టీ ఉంటుంది. ఆభరణాల తయారీ ఖర్చులపై 18 శాతం జీఎస్టీ ఉంది. రూ.20లక్షల వ్యాపార లావాదేవీలు దాటిన ప్రతి వ్యాపారి జీఎస్టీ పరిధిలోకి వస్తారు. 500 గ్రాముల బంగారం పరిమితి మించితే స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం చెప్పడంతో గందరగోళం మొదలైంది. 

పూర్వీకుల నుంచి సంక్రమించిన బంగారం, నగలపై పన్ను విధిస్తారనేదానిపై క్లారిటీ లేదు. వారసత్వంగా సంక్రమించిన పాత బంగారు నగలు, వ్యవసాయ ఆదాయంతో కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలపై పన్ను విధించే ప్రతిపాదనేదీ కొత్త చట్టంలో లేదు. వివాహిత మహిళలకు 500 గ్రాములు, అవివాహిత మహిళలకు 250 గ్రాములు, పురుషులకు 100 గ్రాముల వంతున బంగారు ఆభరణాలకు ఇప్పటికే అనుమతి ఉంది. మరోవైపు చట్టబద్ధమైన బంగారు ఆభరణాలకు పూర్తి రక్షణ ఉంటుందని సిబిడిటి ఇదివరకే తేల్చిచెప్పేసింది.