మధ్యతరగతికి మెగా రాయితీ : ఐటీ పరిమితి రూ. 5లక్షలకు పెంపు

  • Published By: veegamteam ,Published On : January 15, 2019 / 04:28 AM IST
మధ్యతరగతికి మెగా రాయితీ : ఐటీ పరిమితి రూ. 5లక్షలకు పెంపు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని వర్గాలను ఆకట్టుకొనేందుకు మోడీ సర్కార్ వ్యూహాలు రచిస్తోంది. మధ్యతరగతి ప్రజలే టార్గెట్ గా మోడీ సర్కార్ పావులు కదుపుతోంది. ఉద్యోగస్థులను ఆకట్టుకొనేందుకు ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న 2.5లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పటివరకూ 2.5 లక్షల వరకూ పన్నులేదు. 2.5 లక్షల నుంచి 5లక్షల దాకా 5శాతం, 5నుంచి 10 లక్షల ఆదాయం ఉన్నవారికి 20శాతం, 10 లక్షల పైన ఉన్నవారికి 30శాతం పన్ను విధిస్తున్నారు.

ఆదాయపు పన్ను పరిమితి పెంపుతో పాటు మెడికల్ ఖర్చులు, రవాణా భత్యం మొదలైనవి పన్ను మినహాయింపు జాబితాలో యథాతథంగా కొనసాగించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. డీమానిటైజేషన్ వల్ల నష్టపోయిన ఈ వర్గాలకు ఈ ఉపశమనం కలిగిస్తేనే రాబోయో ఎన్నికల్లో వారి నుంచి ప్రతికూలత రాకుండా తట్టుకోగలమని అభిప్రాయపడుతోంది.

ఫిబ్రవరిలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టబోయే తాత్కాలిక బడ్జెట్ లో ఈ మేరకు ప్రకటన వెలువడే అవకాశముందని తెలుస్తోంది. ఈబీసీ రిజర్వేషన్లు మాత్రమే మధ్యతరగతి ప్రజలను ఆకర్షించడానికి సరిపోదని, పూర్తిగా సంతృప్తి పర్చాలంటే మెగా రాయితీ ఇవ్వాలని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ రెట్టింపుకు మరో నెల రోజుల్లో రాబోయో ప్రత్యక్ష పన్నుల కోడ్(డీటీసీ) ఇబ్బందికరంగా మారే అవకాశముంది. దానికి ముందే పన్ను రేట్లు మార్చడం ద్వారా అది వివాదం రేపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆదాయాన్ని, పన్ను విధానాన్ని పునర్నిర్వచించేది ఈ డీటీసీ. మరింత మందిని పన్ను పరిధిలోకి తీసుకురావడంతోపాటు వివిధ వర్గాల పన్ను చెల్లింపుదారులకు సమన్యాయం చేయడం దీని లక్ష్యం.