Indian Overseas Bank : లోన్ తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు భారీగా తగ్గించిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్..!
Indian Overseas Bank : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త రేట్లు ఏప్రిల్ 12, 2025 నుంచి అమలులోకి వస్తాయని IOB తెలిపింది.

Indian Overseas Bank
Indian Overseas Bank : లోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్.. దేశంలోని మరో ప్రభుత్వ బ్యాంకు వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) రెపో రేటుతో లింక్ అయిన వడ్డీ రేటును 0.25 శాతానికి తగ్గించింది. ఈ విషయాన్ని బ్యాంక్ ఈరోజే ప్రకటించింది.
ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో పాలసీ రేటు రెపోను 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. గత వారమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువుల దిగుమతిపై 26 శాతం సుంకాన్ని ప్రకటించిన తర్వాత పెరుగుతున్న అనిశ్చితుల మధ్య వడ్డీ రేట్లను తగ్గించాలని బ్యాంక్ నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్ 11న జరిగిన ఆస్తి బాధ్యత నిర్వహణ కమిటీ సమావేశం (Asset Liability Management Committee)లో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది. రెపో-లింక్డ్ రుణాలపై వడ్డీ రేటును బ్యాంక్ 0.25 శాతం తగ్గించి 9.10 శాతం నుంచి 8.85 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు ఏప్రిల్ 12, 2025 నుంచి అమల్లోకి వస్తుంది.
వడ్డీ రేట్లను తగ్గించిన ఇతర బ్యాంకులు :
గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. బ్యాంకుల ఈ నిర్ణయంతో ప్రస్తుత, కొత్త రుణగ్రహీతలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇండియన్ బ్యాంక్ తన రెపో-లింక్డ్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును ఏప్రిల్ 11 నుంచి 35 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.70 శాతానికి తీసుకురానున్నట్లు తెలిపింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RBLR)ను 9.10 శాతం నుంచి 8.85 శాతానికి సవరించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త (RBLR) 8.85 శాతంగా ఉంది. గతంలో ఇది 9.10 శాతంగా ఉంది. అదే సమయంలో, యుకో బ్యాంక్ కూడా లోన్ రేటును 8.8 శాతానికి తగ్గించినట్లు ప్రకటించింది.
ఏప్రిల్ 9న ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రెపో రేటు తగ్గింపును ప్రకటించారు. ఇప్పుడు రెపో రేటు 6 శాతానికి తగ్గింది. చివరిసారిగా ఫిబ్రవరి పాలసీలో ఆర్‌బీఐ 5 ఏళ్లలో మొదటిసారి రెపో రేటును తగ్గించింది.