బాబోయ్… ఇంత రేంజ్ లో డేటా వాడేస్తున్నారా….?

ఏడాది కాలంలో భారత దేశంలో వైర్‌లెస్ డేటా వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని ట్రాయ్ వెల్లడించింది. 2014లో భారతీయ కస్టమర్లు 82.8 కోట్ల గిగాబైట్స్ (జీబీ) డేటా వాడితే.. 2018 వచ్చే సరికి ఇది 4,640 కోట్ల జీబీకి చేరిందని ట్రాయ్ లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచంలోని అన్ని రంగాలలో ప్రస్తుతం వైర్లెస్ డాటా కీలకంగా మారింది. ఇక మొబైల్ వినియోగదారుల గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. వాళ్ల వాడకం మామూలుగా ఉండట్లేదు.
ఒకప్పుడు వన్ జీబీ డేటాను నెల మొత్తం సరిపెట్టుకునే మొబైల్ వినియోగదారులు.. ఇప్పుడు గంట సమయానికి వన్ జీబీ సరిపెట్టుకో లేనంత పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగించటం వైర్ లెస్ డేటా లేకుండా ఏపని చేయలేకుండా ప్రజలు అలవాటు పడిపోయారు.ఆధునిక టెక్నాలజీ పెరిగి అరచేతిలోకి ప్రపంచం వచ్చేసింది. ఎక్కడుకు వెళ్లాల్సిన పనిలేకుండా కూర్చున్న చోటునుంచే స్మార్ట్ ఫోన్ లోనే అన్ని పనులు కానిచ్చేస్తున్నారు. దీంతో డేటా వినియోగం బాగా పెరిగింది.
ప్రస్తుత 2019లో జనవరి–సెప్టెంబర్ వరకు ఇది ఏకంగా 5,491.7 కోట్ల జీబీగా నమోదైంది. 2017లో వినియోగదార్లు 2,009 కోట్ల జీబీ డేటాను వాడారు. 2014తో పోలిస్తే వైర్‌లెస్ డేటా యూజర్ల సంఖ్య 28.16 కోట్ల నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి 66.48 కోట్లకు చేరారు.
2017తో పోలిస్తే 2018లో యూజర్ల వృద్ధి 36.36 శాతంగా ఉంది. గత నాలుగేళ్లలో డేటా వాడకం ఊహించనంతగా పెరిగిందని ట్రాయ్ తెలిపింది. 4జీ/ఎల్‌టీఈ రాక, ఈ టెక్నాలజీ విస్తృతితో ఇది సాధ్యమైంది. దేశంలో మొబైల్ నెట్‌వర్క్స్ అత్యధిక ప్రాంతం 2జీ నుంచి 4జీకి మారడం, అందుబాటు ధరలో స్మార్ట్‌ఫోన్లు లభించడం ఇంటర్నెట్ వాడకాన్ని పెంచింది.
మొబైల్ టారిఫ్‌లు పడిపోవడం, ఇంగ్లిష్, హిందీతోపాటు ప్రాంతీయ భాషల్లో కంటెంట్ లభించడం కూడా ఇందుకు దోహదం చేసింది. 2016 లో మార్కెట్ లోకి వచ్చిన జియో కూడా వినియోగాదారులకు కొన్నాళ్లు ఉచితంగా డేటా అందివ్వటం..తర్వాతి కాలంలో డేటా చార్జీలు భారీగా తగ్గటం వలన కూడా వైర్ లెస్ డేటా వినియోగం పెరగటానికి కారణం అయ్యిందని టెలికాం రంగ నిపుణులు అంటున్నారు.
ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం కోట్లాది మందిని సాధికారత వైపు నడిపింది. వీరికి రియల్ టైమ్ సమాచారం, ప్రభుత్వ సేవలు, ఈ–కామర్స్, సోషల్ మీడియా ఎప్పటికప్పుడు చేరింది. దీంతో వీరి జీవితాలపై సానుకూల ప్రభావం చూపింది’ అని ట్రాయ్ తెలిపింది.