Gold Demand: తగ్గుతున్న బంగారం డిమాండ్.. ఎందుకంటే?

దేశంలో పెళ్లిళ్ల సీజన్‌తో పాటు అక్షయ తృతీయ వేళ..

Gold Demand: తగ్గుతున్న బంగారం డిమాండ్.. ఎందుకంటే?

Updated On : April 30, 2025 / 8:59 PM IST

బంగారం ధరలు రోజురోజుకీ పెరిగిపోతుండడంతో పసిడిని కొనేవారు తగ్గిపోతున్నారు. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో పసిడి డిమాండ్ 15 శాతం తగ్గి, 118.1 టన్నులకు చేరింది. ఈ వివరాలను వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ తెలిపింది.

గత ఏడాదితో పోల్చితే ప్రజలు ఈ త్రైమాసికంలో 15% తక్కువ బంగారాన్ని కొనుగోలు చేసినప్పటికీ, బంగారం కోసం ఖర్చు చేసిన మొత్తం డబ్బు మాత్రం 22 శాతం పెరిగి, రూ.94,030 కోట్లకు చేరుకుంది.

ధరల పెరుగుదల వల్ల మాత్రమే ఈ ఖర్చు పెరిగింది. ఈ ఏడాది దేశంలో గోల్డ్ డిమాండ్ 700 – 800 టన్నుల మధ్య ఉంటుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు పసిడి ధర 25 శాతం వరకు పెరిగింది.

Also Read: వ్యూహం మార్చిన కాంగ్రెస్ పార్టీ.. ఏం జరుగుతోంది?

గత వారం రోజులుగా మాత్రం పసిడి ధర తగ్గుతూ వస్తోంది. అయినప్పటికీ, వారం క్రితం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.లక్ష దాటింది. దీంతో కొనుగోలుదారులు బంగారాన్ని కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు.

దేశంలో పెళ్లిళ్ల సీజన్‌తో పాటు అక్షయ తృతీయ వేళ కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని డబ్ల్యూజీసీ చెప్పింది. ధరలు పెరుగుతుండడంతో ప్రజలు ఇప్పుడు తేలికపాటి పసిడి ఆభరణాలను కొనేందుకు మాత్రమే ఆసక్తి చూపుతున్నారు.

మరికొందరు ధరలు తగ్గాక కొందామని వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొంటున్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల వల్ల చాలా మంది పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు.

జనవరి-మార్చి మధ్య బంగారు ఆభరణాల డిమాండ్ కూడా 25 శాతం తగ్గి, 71.4 టన్నులకు చేరింది. మరోవైపు, ఇవాళ అక్షయ తృతీయ కావడంతో దేశంలోని మార్కెట్లో రూ.16 వేల కోట్ల వ్యాపారం జరిగొచ్చని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ అంటోంది.