వ్యూహం మార్చిన కాంగ్రెస్ పార్టీ.. ఏం జరుగుతోంది?
మొత్తానికి క్యాబినెట్ విస్తరణకు సమీకరణాలు సెట్ కాకపోవడంతో దానిని పక్కన పెట్టి.. పార్టీ కార్యవర్గంపై దృష్టి పెట్టింది అధిష్టానం.

కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం మార్చింది. క్యాబినెట్ విస్తరణ విషయంలో పరిణామాలు మారడంతో.. పార్టీ హైకమాండ్ కూడా తన నిర్ణయాన్ని మార్చుకుంది. క్యాబినెట్ విస్తరణ తర్వాతే అన్ని కమిటీలు వేయాలని భావించినా..ఆ నిర్ణయాన్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది.? తాజా వ్యూహంలో పార్టీ ఏం చేయాలని భావిస్తోంది? మంత్రి వర్గ విస్తరణకు తాత్కాలిక బ్రేక్ వేయడానికి గల కారణాలేంటి? క్యాబినెట్ విస్తరణ వాయిదా పడడంతో అటు ఆశావహుల పరిస్థితి ఏంటి? వాచ్ దిస్ స్టోరీ.
తెలంగాణ కాంగ్రెస్ లో పార్టీ అధిష్టానం తీసుకున్న తాజా నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. క్యాబినెట్ విస్తరణ అంశాన్ని పార్టీ హైకమాండ్ పక్కన పెట్టి..పార్టీ కార్యవర్గంపై ఫోకస్ పెట్టింది. క్యాబినెట్ విస్తరణ విషయంలో సమీకరణాలు ఓ పట్టాన కుదరడంలేదు. సామాజిక సమీకరణాలలో నేతల మధ్య ఏకాభిప్రాయం అస్సలు కుదరడంలేదు. ముఖ్యంగా రెడ్డి సామజికవర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, దొంతి మాధవ రెడ్డి, మల్ రెడ్డి రంగా రెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి వంటి నేతలు బలంగా పోటీ పడుతున్నారు.
వీరితో పాటు మంచిర్యాల జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్ లు సైతం పోటీ పడుతున్నారు. క్యాబినెట్ విస్తరణలో ఆశావహులు ఎక్కువగా పోటీ పడుతుండటంతో..పదవులు దక్కని నేతలు పార్టీకి నష్టం చేసే అవకాశం ఉందని పార్టీ అధిష్టానం భావిస్తోందట. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అంశాన్ని కాసేపు పక్కన పెట్టిందని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో టాక్ విన్పిస్తోంది. క్యాబినెట్ విస్తరణకు తాత్కాలిక బ్రేక్ పడడంతో ఆశావహులు ఊసురుమంటూ తీవ్ర ఆవేదనలో మునిగిపోయారన్న టాక్ గాంధీభవన్ వర్గాల్లో విన్పిస్తోంది.
పార్టీ కార్యవర్గంపై ఫోకస్
క్యాబినెట్ విస్తరణ అంశాన్ని పక్కకు పెట్టిన అధిష్టానం.. తాజాగా పార్టీ కార్యవర్గంపై ఫోకస్ పెట్టింది. కార్యవర్గానికి సంబంధించి..కమిటీల నియామకంపై దృష్టి పెట్టింది. తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గం కూడా చాలా కాలం నుంచి పెండింగ్ పడుతుండడంతో..భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే ఇప్పుడు పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా..ఒకే విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించింది.
వాటిని బూత్, మండల స్థాయి, జిల్లా స్థాయిల్లో బలోపేతం చేయాలని ఇటీవల జరిగిన ఏఐసీసీ సమావేశాల్లో పార్టీ తీర్మానం చేసింది. అందుకోసం తెలంగాణలో బూత్ స్థాయి, మండల స్థాయి కమిటీల నియామకం కోసం టీ కాంగ్రెస్ రాష్ట్ర పరిశీలకులను వేసింది. మరో వారం, పది రోజుల్లో ఈ కమిటీలను భర్తీ చేయాలని ఆదేశించింది. పార్టీ అధిష్టానం కార్యవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టడంతో వాటిలో స్థానం సంపాదించేందుకు నేతలు గాంధీ భవన్ కు క్యూ కడుతున్నారట. కార్యవర్గంలో మాకొక పోస్ట్ కావాలంటూ మంత్రులు, సీనియర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారట.
ఒకవైపు గ్రౌండ్ స్థాయిలో కమిటీల నియామకం చేపడుతూనే..మరోవైపు రాష్ట్ర స్థాయి కమిటీల విషయంలో కూడా పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. తొలుత వైస్ ప్రెసిడెంట్లను నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు సమాచారం అందించింది.
ఆ తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలకు..
మొత్తం 22 మంది వైస్ ప్రెసిడెంట్ల నియామకానికి పార్టీ అధిష్టానం ఆమోదం తెలిపింది. ఈ 22 మందిని కూడా కొత్త జిల్లాలకు కేటాయించాలని సూచించింది. మే10లోగా వైస్ ప్రెసిడెంట్ల పోస్టులను భర్తీ చేయాలని.. టి-పిసిసికి ఆదేశాలు జారీ చేసింది. ఇక మిగతా కమిటీలకు సంబంధించి కూడా మే నెలాఖరులోపు భర్తీ చేయాలని ఆదేశాలు ఇచ్చిందట. రాష్ట్ర స్థాయి కమిటీలను జూన్ మొదటి వారంలోపు నియమించి..లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని పార్టీ హైకమాండ్ ఆలోచన చేస్తుందని గాంధీభవన్ వర్గాల్లో విన్పిస్తున్న మాట.
మొత్తానికి క్యాబినెట్ విస్తరణకు సమీకరణాలు సెట్ కాకపోవడంతో దానిని పక్కన పెట్టి.. పార్టీ కార్యవర్గంపై దృష్టి పెట్టింది అధిష్టానం. పార్టీ పదవులను భర్తీ చేసి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన చేస్తుంది. కాంగ్రెస్ హైకమాండ్ చేస్తున్న ఈ ఆలోచన ఏ మేరకు వర్కవుట్ అవుతుందనే చూడాల్సి ఉంది. అయితే ఆశావహులు మాత్రం మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడడంతో ఒక్కసారిగా నిరూత్సాహంలోకి కూరుకుపోయారట. ఇప్పటికే క్యాబినెట్ విస్తరణ అనేకసార్లు వాయిదా పడిందని..ఇప్పుడు మరోసారి వాయిదా పడడంతో మళ్లీ ఎప్పుడుంటుందో అని ఆశావహులంతా తెగ టెన్షన్ పడుతున్నారట.