బంగారంపై 46% లాభం, నిఫ్టీ 13% మాత్రమే.. ఇప్పుడుగనక గోల్డ్‌లో పెట్టుబడి పెడితే..? నిపుణుల సూచనలు..

తొందరపడి బంగారం అమ్మేయడం లేదా గుడ్డిగా కొనడం రెండూ ప్రమాదకరమే.

బంగారంపై 46% లాభం, నిఫ్టీ 13% మాత్రమే.. ఇప్పుడుగనక గోల్డ్‌లో పెట్టుబడి పెడితే..? నిపుణుల సూచనలు..

Updated On : July 3, 2025 / 4:57 PM IST

గత కొన్ని నెలలుగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుంటే, స్టాక్ మార్కెట్ (నిఫ్టీ) మాత్రం నెమ్మదిగా సాగుతోంది. ఈ సమయంలో “నా కష్టార్జితాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలి? బంగారం కొనాలా? లేక ఈక్విటీలలోనే ఉండాలా?” అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదులుతోంది.

ఈ రెండింట్లో ఏది బెటర్? బంగారం పరుగులు ఎక్కడి వరకు కొనసాగుతాయి? ప్రముఖ మార్కెట్ నిపుణులు ఏం చెబుతున్నారో వివరంగా తెలుసుకుందాం..

ప్రస్తుత బంగారం ర్యాలీకి కారణాలు ఒకటీరెండు కాదు..

గ్లోబల్ టెన్షన్లు: అమెరికాలోని రాజకీయ పరిస్థితులు, దేశాల మధ్య పెరుగుతున్న భూ రాజకీయ ఉద్రిక్తతలు, అలాగే అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాల భయాలు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి.

“సేఫ్ హెవెన్” డిమాండ్: యాక్సిస్ సెక్యూరిటీస్‌లో మేనేజెడ్ అకౌంట్స్‌ విభాగం అధ్యక్షుడు రంజు రాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇలాంటి సంక్షోభ సమయాల్లో గ్లోబల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు రక్షణ కల్పించుకోవడానికి బంగారం, US డాలర్ వంటి సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గుచూపుతారు. బంగారం ఒక “స్టెబిలైజర్” (స్థిరత్వాన్ని ఇచ్చేది) గా పనిచేస్తుంది.

దేశీయ డిమాండ్: అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితి, స్పాట్ మార్కెట్ల నుంచి స్థిరంగా వస్తున్న డిమాండ్ కూడా దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలకు మద్దతునిచ్చింది.

Also Read: మోదీకి ఘనా అత్యున్నత పురస్కారం.. ఆ దేశ పార్లమెంటులో భారత ప్రధాని కీలక కామెంట్స్‌

బంగారం Vs నిఫ్టీ  

2024 ఏప్రిల్ నుంచి ఈ రెండింటి పనితీరును ఒక్కసారి గమనిద్దాం..

  • బంగారం రాబడి: 46.06%
  • నిఫ్టీ 50 రాబడి: 13.03%
  • ఈ గణాంకాలు స్పష్టంగా చెప్పేది ఏంటంటే.. స్వల్పకాలంలో ఈక్విటీ మార్కెట్‌ను బంగారం ఎంతగానో అధిగమించింది.

బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం పరుగులు చూసి ఇప్పుడే పెట్టుబడి పెట్టాలని తొందర పడుతున్నారా? అయితే నిపుణుల హెచ్చరికలను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి.

బోనాంజా‌కు చెందిన సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ కునాల్ కాంబ్లే తెలిపిన వివరాల ప్రకారం.. సాంకేతికంగా బంగారం ప్రస్తుతం “ఓవర్‌బాట్ జోన్” (Overbought Zone)లో ఉంది.

ఓవర్‌బాట్ జోన్ అంటే.. కొనుగోళ్లు విపరీతంగా పెరిగి, ఆస్తి విలువ దాని వాస్తవ విలువ కంటే ఎక్కువగా ట్రేడ్ అవ్వడం. ఇలాంటి సమయంలో ధరలు తగ్గే (పుల్‌బ్యాక్) ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

“ప్రస్తుతం బంగారం దాని సగటు ధర (9EMA) కంటే 12.19% ఎగువన ట్రేడ్ అవుతోంది, ఇది సాధారణంగా 10% లోపే ఉంటుంది. ఇది మార్కెట్ బలహీనపడటానికి సంకేతం. కాబట్టి కొత్త కొనుగోళ్లకు ఇది రిస్క్‌తో కూడుకున్నది” అని కాంబ్లే విశ్లేషించారు.

మరి ఇన్వెస్టర్లు ఏం చేయాలి?  

ఒకవైపు బంగారం రిస్క్‌లో ఉంది, మరోవైపు భారత ఈక్విటీ మార్కెట్లకు సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మీ పెట్టుబడి వ్యూహం ఎలా ఉండాలి?

మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్‌కు చెందిన విశ్ణు కాంత్ ఉపాధ్యాయ్ ప్రతిపాదిస్తున్న వ్యూహాన్ని చూద్దాం..

లాభాలను స్వీకరించండి: ఇప్పటికే బంగారంలో పెట్టుబడి పెట్టి మంచి లాభాల్లో ఉన్నవారు, పాక్షికంగా లాభాలను స్వీకరించడం (Partial Profit Booking) మంచిది.

డబ్బును తిరిగి కేటాయించండి (Re-allocate): బంగారం నుంచి తీసిన డబ్బును బ్యాంకింగ్, ఫైనాన్స్ వంటి అండర్‌వాల్యూడ్  రంగాలలో ఉన్న నాణ్యమైన నిఫ్టీ, సెన్సెక్స్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడాన్ని పరిశీలించవచ్చు.

డైవర్సిఫికేషన్ మర్చిపోవద్దు: మీ పోర్ట్‌ఫోలియోలో భద్రత కోసం, కొంత భాగాన్ని (సుమారు 5-10%) బంగారంలో ఎప్పుడూ కొనసాగించడం చాలా ముఖ్యం. ఇది మార్కెట్ పతనాల నుంచి రక్షణ కల్పిస్తుంది.

భారత ఆర్థిక వ్యవస్థకు ఆర్‌బీఐ సపోర్టు, తగ్గుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, రాబోయే త్రైమాసికాలలో కంపెనీల ఆదాయాలు పెరుగుతాయనే అంచనాలు నిఫ్టీకి మద్దతుగా నిలుస్తున్నాయి.

తొందరపడి బంగారం అమ్మేయడం లేదా గుడ్డిగా కొనడం రెండూ ప్రమాదకరమే. మీ పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా, కొంత లాభం స్వీకరించి, ఆ డబ్బును ఈక్విటీలలోకి మార్చడం ప్రస్తుత పరిస్థితుల్లో తెలివైన వ్యూహం.