ITR Filing 2025 : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. ITR ఫైలింగ్ డెడ్‌లైన్ ఒకటి కాదు.. ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు లాస్ట్ డేట్స్ ఇవే.. చెక్ చేయండి!
ITR Filing 2025 Deadline : ఐటీఆర్ ఫైలింగ్ చేస్తున్నారా? అందరి టాక్స్ పేయర్లకు డెడ్‌లైన్ ఒకటి కాదు.. ఎవరెవరికి ఐటీఆర్ ఫైలింగ్ డెడ్‌లైన్ ఎప్పుడంటే?

ITR Filing 2025
ITR Filing 2025 Deadline : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. మీ ITR ఫైలింగ్ డెడ్‌లైన్ ఎప్పుడో తెలుసా? ఆదాయపు పన్ను శాఖ FY2024-25 (అసెస్‌మెంట్ ఇయర్ 2025-26) కోసం ITR ఫైలింగ్ (ITR Filing 2025 Deadline) గడువును జూలై 30, 2025 నుంచి సెప్టెంబర్ 15, 2025 వరకు మొత్తం 45 రోజులు పొడిగించింది.
ఈ కొత్త గడువు తేదీ వ్యక్తులు, హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ (HUF) అకౌంట్లకు ఆడిటింగ్ అవసరం లేని ఇతర పన్ను చెల్లింపుదారులకు వర్తిస్తుంది. 2025–26 అసెస్‌మెంట్ ఇయర్ (AY) కోసం ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) యుటిలిటీల అమలుకు అవసరమైన సమయాన్ని నోటిఫై చేసింది.
పన్ను చెల్లింపుదారులు సౌకర్యవంతంగా ITR దాఖలు చేసేందుకు ముందుగా జూలై 31, 2025న గడువు విధించగా ఆ తర్వాత సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించాలని నిర్ణయించినట్టు CBDT ఒక ప్రకటనలో పేర్కొంది. వారం క్రితమే పోర్టల్‌లో ముందే నింపిన డేటాతో ఆన్‌లైన్ మోడ్ ద్వారా ITR-2 ఆదాయపు పన్ను రిటర్న్ ఫారమ్‌ను దాఖలు చేయొచ్చు.
ఆడిట్ అవసరం లేని వారికి సెప్టెంబర్ 15 డెడ్‌లైన్ :
ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులకు పన్ను శాఖ గడువును పొడిగించింది. ఆదాయపు పన్ను ఫారమ్‌లలో మార్పులు, కొత్త ఆదాయపు పన్ను కింద కొత్త స్లాబ్‌లు, మూలధన లాభాల పన్నుల కారణంగా తేదీలను పొడిగించాలని నిర్ణయం తీసుకుంది.
అక్టోబర్ 31 నాటికి ఎవరు ITR ఫైల్ చేయవచ్చు? :
కంపెనీలు, యాజమాన్య సంస్థలు, సంస్థలలో పనిచేసే పార్టనర్లు వంటి అకౌంట్లకు ఆడిట్ చేయాల్సిన పన్ను చెల్లింపుదారులు 2024-25 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ సంవత్సరం 2025-26) తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITR) దాఖలు చేసేందుకు అక్టోబర్ 31, 2025 వరకు గడువు ఉంది. అలా చేసే ముందు తమ ఆడిట్ రిపోర్టును సెప్టెంబర్ 30, 2025 నాటికి సమర్పించాలి. ప్రస్తుతానికి, ఆదాయపు పన్ను శాఖ ఈ గడువును పొడిగించినట్లు ప్రకటించలేదు.
అంతర్జాతీయ లావాదేవీలపై ITR దాఖలు గడువు :
పన్ను చెల్లింపుదారులు ఎవరైనా అంతర్జాతీయ లావాదేవీలు లేదా నిర్దిష్ట దేశీయ లావాదేవీలు చేయాలంటే.. సెక్షన్ 92E కింద నివేదికను సమర్పించాలి. ఈ సందర్భంలో ITR దాఖలుకు చివరి తేదీ నవంబర్ 30, 2025. ఇందుకోసం ముందుగా ఆడిట్ రిపోర్టు అక్టోబర్ 31, 2025 లోపు సమర్పించాలి. ఇతర కేటగిరీల మాదిరిగానే ఈ గడువు తేదీని పొడిగించడంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.
డెడ్‌లైన్ మర్చిపోయారా? ఆలస్యమైన ITR గడువు తేదీలివే :
మీరు అసలు ఐటీఆర్ గడువు ఎప్పుడు అనేది మర్చిపోతే.. మీరు ఇప్పటికీ ఆలస్యంగా రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు. పన్ను చెల్లింపుదారులందరికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆలస్యమైన ఐటీఆర్‌ను డిసెంబర్ 31, 2025 వరకు సమర్పించవచ్చు. అయితే, ఆలస్యంగా దాఖలు చేయడం వల్ల పెనాల్టీలు విధించబడవచ్చు లేదా కొన్ని పన్ను ప్రయోజనాలను తగ్గించవచ్చునని గుర్తుంచుకోండి.
డెడ్‌లైన్ దాటితే ఏమౌతుంది? :
పన్ను చెల్లింపుదారులు చెల్లించని పన్ను మొత్తంపై నెలకు 1 శాతం లేదా పాక్షికంగా నెలవారీ వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.
ఆలస్యంగా దాఖలు చేస్తే పెనాల్టీలు :
మొత్తం ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే రూ. వెయ్యి పెనాల్టీ చెల్లించాలి.
మొత్తం ఆదాయం రూ. 5 లక్షలకు మించి ఉంటే.. రూ. 5వేలు పెనాల్టీ చెల్లించాలి.