జియోలో గూగుల్ పెట్టుబడులపై స్పందించిన సుందర్ పిచాయ్

భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే 5-7 సంవత్సరాలలో భారత్ లో 75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నట్లు గతవారం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇందులో భాగంగా తొలుత రిలయన్స్ జియోతో గూగుల్ ఒప్పందం చేసుకుంది.
ఇటీవల పలు విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకట్టుకుంటున్న జియో ప్లాట్‌ఫామ్స్ తాజాగా టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ను సైతం ఆకర్షించింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్ రూ. 33,737 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు బుధవారం(జులై-15,2020)వీడియో కాన్ఫెరెన్సింగ్ ద్వారా నిర్వహిస్తున్న రిలయన్స్ వార్షిక జనరల్ మీటింగ్(AGM)సందర్భంగా ముకేశ్ అంబానీ వెల్లడించారు.
తద్వారా రిలయన్స్ జియోలో 7.7 శాతం వాటాను గూగుల్ సొంతం చేసుకోనున్నట్లు ముకేష్ అంబానీ తెలియజేశారు. జియోకు గూగుల్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుందని తెలిపారు. గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా అందుబాటు ధరల్లో 4జీ/5జీ ఫోన్లను తయారు చేనున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా దేశీ వినియోగం కోసం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించనున్నట్లు వివరించారు.
ముకేష్ అంబానీ ప్రకటన తర్వాత గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలని పిచాయ్ తెలిపారు. గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ లో తొలి విడతగా రిలయన్స్ లో 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నామని… ఇది తమకు చాలా గర్వంగా ఉందని చెప్పారు. స్మార్ట్ ఫోన్ లేని లక్షలాది మందికి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో భాగస్వాములం కావడం గొప్పగా ఉందన్నారు. మొదట జియోలో పెట్టుబడి భారతదేశ పెట్టుబడి ప్రణాళికలలో అతిపెద్దది అని పిచాయ్ అన్నారు
Everyone should have access to the internet. Proud to partner with @reliancejio to increase access for the hundreds of millions in India who don’t own a smartphone with our 1st investment of $4.5B from the #GoogleForIndia Digitization Fund.https://t.co/1fP8iBZQfm
— Sundar Pichai (@sundarpichai) July 15, 2020