‘కియా’.. మేడిన్ ఆంధ్రా.. అదిరిపోయే ఫీచర్లు : కారు ధర ఎంతో తెలుసా?

కొరియాకు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం కియా మోటార్స్ నుంచి సెల్టోస్ కారు మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఎస్‌యూవీ కారును దేశీయ మార్కెట్‌లోకి తీసుకుని వచ్చింది కియా మోటార్స్ ఇండియా. కంపెనీ ఈ కారుతో ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమలోకి అధికారికంగా అడుగుపెట్టింది.
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం ప్లాంట్‌లో తయారు చేసిన కియా సెల్టోస్ మూడు ఇంజిన్ ఆప్షన్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. ప్రారంభ ధర రూ.9.69 లక్షల నుంచి టాప్ వేరియంట్ ధర రూ.15.99 లక్షల వరకు ధరలు ఉండనున్నాయి. ఈ ధరలన్నీ ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధరలు.
ఇప్పటికే కియా కంపెనీ దేశవ్యాప్తంగా 32,035 బుకింగ్‌లు వచ్చినట్లు కియా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్, మార్కెటింగ్ హెడ్ మనోహర్ భట్ వెల్లడించారు. ప్రీ బుకింగ్‌లను ఆన్‌లైన్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా 206 సేల్ పాయింట్ల వద్ద జూలై 16వ తేదీన ప్రారంభం అయ్యింది. కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా 192 సర్వీస్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది.
ఈ కొత్త కారు బీఎస్6 ప్రమాణాలకు అనువుగా 1.4లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో అభ్యం అవుతుంది. కారు లీటరుకు 16నుంచి 21 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. వేరియంట్ మారితే మైలేజ్ మారుతుంది. రెడ్, వైట్, సిల్వర్, గ్రే, బ్లాక్, బ్లూ, ఆరంజ్ రంగుల్లో కారు అందుబాటులోకి వస్తుంది.
సూపర్ స్టైలింగ్, అదిరిపోయే లుక్ తో 17 అంగుళాల క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్, ఇంకా కారులో మోడ్రన్ ఫీచర్లు చాలానే ఉన్నాయి. యూవీవో కనెక్టివిటీ సిస్టమ్‌తో కూడిన 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ, 7 అంగుళాల కలర్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, స్మార్ట్ ఎయిర్ ఫ్యూరిఫయర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
అంతేకాదు కారులో వాయిస్ కమాండ్ ఫీచర్ కూడా ఉండగా.. కారు మీరు చెప్పినట్లు వింటుంది. ఎవరైనా కారును దొంగలిస్తే ఎక్కడుందో వెంటనే తెలుసుకోవచ్చు. రిమోట్ ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్ ఫెసిలిటీ ఉంది. కారు సెక్యురిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ స్టెబిటిటీ కంట్రోల్, ఏబీఎస్, ఈబీడీ, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఆల్ వీల్ డిస్క్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.