LIC: అగ్రస్థానంలో ప్రభుత్వ దిగ్గజం ‘ఎల్ఐసీ’.. రూ.13,492 కోట్ల నికర లాభం
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరొకసారి చాటుకుంది.
Lic q1 results net profit rises 23 percent to 13492 crore rupees
- రూ. 13,492 కోట్ల లాభం
- 23 శాతం పెరిగిన లాభాలు
- 60 శాతం మార్కెట్ వాటా
LIC: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అత్యుత్తమ ఆర్థిక ఫలితాలను నమోదు చేసి మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరొకసారి చాటుకుంది. ఇన్వెస్టర్లతో పాటు కోట్లాది మంది పాలసీదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బీమా రంగంలో కంపెనీ తన బలమైన వృద్ధి ప్రయాణాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తోంది. ఈ మేరకు సంస్థ విడుదల చేసిన త్రైమాసిక నివేదికలో తమ ఆదాయం, లాభాల పురోగతికి సంబంధించిన ఆసక్తికర వివరాలను అధికారికంగా వెల్లడించింది.
23 శాతం పెరిగిన నికర లాభం, భారీగా ఆదాయం:
సమీక్షా కాలంలో ఎల్ఐసీ(LIC) ఏకంగా రూ.13,492 కోట్ల నికర లాభాన్ని అర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.10,987 కోట్లతో పోలిస్తే ఇది ఏకంగా 23 శాతం వృద్ధి కావడం విశేషం. ఇక కంపెనీ మొత్తం ఆదాయం రూ.2.22 లక్షల కోట్ల నుంచి రూ.2,37,848 కోట్లకు ఎగబాకింది. తొలి ఏడాది ప్రీమియం వసూళ్లు రూ.9,217 కోట్లకు చేరగా, రెన్యువల్ ప్రీమియం వసూళ్లు రూ.61,833 కోట్లుగా నమోదయ్యాయి. Single ప్రీమియం ద్వారా రూ.56,369 కోట్ల ఆదాయం వచ్చిందని ఎల్ఐసీ పేర్కొంది.
60.1 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఎల్ఐసీ:
తొలి త్రైమాసికంలో ఎల్ఐసీ ఇండివిడ్యువల్ సెగ్మెంట్లో ఏకంగా 31.02 లక్షల కొత్త పాలసీలను విక్రయించింది. లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో తొలి ఏడాది ప్రీమియంల ద్వారా 60.1 శాతం భారీ మార్కెట్ వాటాను కైవసం చేసుకుని తామే అగ్రగామిగా కొనసాగుతున్నామని కంపెనీ సీఈఓ, ఎండీ ఆర్ దొరైస్వామి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
