Dream Home : హైదరాబాద్‌లో ఇళ్లు కొనేటప్పుడు ధరలు మాత్రమే కాదు.. డాక్యుమెంట్లు సరిచూసుకోవాలి

Dream Home : హైదరాబాద్ మహా నగరంలో తక్కువ ధరకే ఇళ్లు వస్తుందని ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేయొద్దని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇక చెరువులు, నాలాల సమీపంలో అసలు ప్రాపర్టీలను కొనొద్దని వారు సూచిస్తున్నారు.

Dream Home : హైదరాబాద్‌లో ఇళ్లు కొనేటప్పుడు ధరలు మాత్రమే కాదు.. డాక్యుమెంట్లు సరిచూసుకోవాలి

Hyderabad Real Estate

Dream Home : సొంతిల్లు… ఇది ప్రతి ఒక్కరి కల. లైఫ్‌లో సెటిల్ అయ్యామంటే చాలు చిన్నదో  పెద్దదో ఏదో ఒక సొంతిల్లు కలిగి ఉండాలని కోరుకోని వారు ఉండరు. ఇలా ఓన్ హౌస్ మస్ట్ అయిపోయింది. దీంతో  ఇళ్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంది. నిర్మాణ రంగం కూడా అదే స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఎటువైపు చూసినా హౌసింగ్‌ ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి.

విశ్వనగరంలో రోజు రోజుకు ఉపాధి అవకాశాలు పెరుగుతుండటం కూడా హౌజింగ్‌కు డిమాండ్ మరింత పెంచుతోంది. సరిగ్గా ఇలాంటి అవకాశాలనే కొంతమంది అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ పద్ధతుల్లో భూములను పొంది.. అక్కడ నిర్మాణాలు చేపట్టి… అమాయకులకు అంటగట్టి చేతులు దులుపుకుంటున్నారు.

హైదరాబాద్ మహా నగరంలో తక్కువ ధరకే ఇళ్లు వస్తుందని ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేయొద్దని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇక చెరువులు, నాలాల సమీపంలో అసలు ప్రాపర్టీలను కొనొద్దని వారు సూచిస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల్లో నిర్మాణం చేసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చూస్తే ఇది నిజమేననిపిస్తుంది. చెరువు సమీపంలో నిర్మాణాలను కొనుగోలు చేసేటప్పుడు అన్ని పర్మిషన్లు చెక్ చేసుకోవాలి. అంతే కాదు సంబంధిత విభాగం అధికారులను కలిసి మరోసారి క్రాస్ చెక్ చేసుకోవాలి.  లేదంటే ఇదిగో ఇలా  ఎప్పుడైనా ఇల్లు నేలమట్టం కావచ్చు.

సమస్య ఎప్పుడైనా రావచ్చు.. తస్మాత్‌ జాగ్రత్త : 
ఇక విశ్వనగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇంటి నిర్మాణాలకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ లేదా ఆయా ప్రాంతాల్లోని స్థానిక సంస్థలు అనుమతులు ఇస్తాయి. నిర్మాణ సంస్థలు చేపట్టే ప్రతి ప్రాజెక్టును తప్పనిసరిగా రెరాలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ధృవపత్రాలను పరిశీలించడంతో పాటు… ఆ అనుమతులు నిజమైనవా? కావా? అని నేరుగా కార్యాలయాలకు వెళ్లి క్రాస్‌ చెక్‌ చేసుకోవచ్చు.

అంతే కాకుండా ఆ భూములు ఏఏ సర్వే నంబర్లలో వస్తాయి? అక్కడ చెరువులు, నాలాలు ఏమైనా ఉన్నాయా అనేది తప్పకుండా చెక్‌ చేసుకోవాలి. ఇక ప్రభుత్వ భూములు, పార్క్ భూముల్లో సైతం ఇళ్లను కొనుగోలు చేస్తే ఎప్పటికైనా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

తక్కుధరకు వస్తుంది కదా..? ఏం కాదులే అనుకుంటే ఇదిగో ఇలా ఎప్పుడో ఒకసారి ఆయా విభాగాలు వచ్చి చర్యలు తీసుకుంటే జీవితాంతం కూడబెట్టుకున్న సొమ్ముతో కొనుగోలు చేసిన మీ కలల సౌధం మీ కళ్లముందే నేలమట్టమవుతుంది. కొంతమంది నిర్మాణదారులు తప్పుడు పత్రాలతో అవినీతి అధికారుల చేతులు తడిపి అక్రమంగా అనుమతులు పొందుతున్న సందర్భాలు ఇటీవల నగరంలో పలు ఘటనల్లో వెలుగులోకి వచ్చాయి.

చెరువులు, నాలాల ఎఫ్‌టీఎల్‌ పరిధి, బఫర్‌జోన్లలో ప్రాపర్టీలు కొనుగోలు చేసిన వారు ఎలా నష్టపోయారో మనకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. హైదరాబాద్ మహా నగరంలో ప్రాపర్టీలను కొనుగోలు చేసేటప్పుడు పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత కొనుగోలు చేయాలంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌.

Read Also : Hydra demolitions: హైడ్రాపై కాంగ్రెస్‌లోనూ గుస్సా! ఏం జరుగుతోంది?