Mibot EV : గోల్ఫ్ కార్ట్ సైజులో ‘మిబోట్’ ఎలక్ట్రిక్ కారు వస్తోంది. ఒకరికే సీటు.. ఫుల్ ఛార్జ్‌తో.. 100 కి.మీ దూసుకెళ్లగలదు..!
Mibot EV : జపాన్ గోల్ఫ్ కార్ట్ సైజులో మిబోట్ ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేయనుంది. ఈ మినీ కారులో కేవలం ఒకరు మాత్రమే ప్రయాణించగలరు..

Mibot EV
Mibot EV : జపాన్ కొత్త సూపర్ కారు తీసుకొస్తోంది. గోల్ఫ్ కార్ట్ సైజులో ఎలక్ట్రిక్ కారు లాంచ్ (Mibot EV) చేసేందుకు ప్లాన్ చేస్తోంది. 1945లో అణు బాంబు దాడితో విధ్వంసానికి గురైనా హిరోషిమా నుంచే ఈ కొత్త సూపర్ ఎలక్ట్రిక్ కారు వస్తోంది. మిబోట్ పేరుతో మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది.
టెక్నాలజీలో తిరుగులేని జపాన్ ఇప్పుడు అద్భుతమైన టెక్నాలజీకి కేంద్రంగా డెవలప్ అవుతోంది. హిరోషిమా సమీపంలోని చిన్న గ్రామంలో కెజీ మోటార్స్ అనే చిన్న కార్ల కంపెనీ గోల్ఫ్ కార్ట్ మిబోట్ ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేసింది. ఈ ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ కారుతో జపాన్‌లో రవాణాలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.
గ్రామీణ వీధుల్లో ప్రయాణించే ఈ చిన్న ఎలక్ట్రిక్ వాహనంలో ఒకరు మాత్రమే ప్రయాణించగలరు. ఇతర కార్లతో పూర్తిగా భిన్నంగా ఉండే మిబోట్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువనే చెప్పాలి.
‘మిబోట్’ ఈవీ కారు స్పెషాలిటీ ఇదే :
- మిబోట్ గోల్ఫ్ కార్ట్ మాదిరి కాంపాక్ట్‌గా ఉంటుంది.
- ఫుల్ మోడ్రాన్ ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కారు.
- మిబోట్ ఈవీ కారు ధర దాదాపు రూ. 7 లక్షలు ఉండొచ్చు.
- ఫుల్ ఛార్జ్ చేస్తే.. మిబోట్ 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
- చిన్న దూర ప్రయాణాలకు సరైనది.
- ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు కేవలం 5 గంటలు సమయం పడుతుంది.
- గంటకు 60 కి.మీ గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది.
- కాంపాక్ట్ డిజైన్ గ్రామాల్లో ఇరుకైన దారులు, చిన్న రోడ్లకు సరిగ్గా సరిపోతుంది.
కేజీ మోటార్స్ వ్యవస్థాపకుడు 43 ఏళ్ల కజునారి కుసునోకి హిరోషిమా సమీపంలోని నగరంలో పెరిగారు. గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు, టాక్సీలు వంటి ప్రజా రవాణా రోజురోజుకీ క్షీణించడాన్ని ప్రత్యక్షంగా చూసినట్టు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. 2022లో ఆయన కేజీ మోటార్స్‌ను ప్రారంభించారు.
అప్పటి నుంచి ఆ కంపెనీకి 2,250 కంటే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. చాలా మంది కొనుగోలుదారులు ఇప్పటికే కంపెనీ కార్లను కొన్నారు. అయితే, తక్కువ దూర ప్రయాణానికి తక్కువ ధరలో కార్ల కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారందరి కోసమే మిబోట్ అనే ఈవీ కారును మార్కెట్లోకి తీసుకురానున్నట్టు నివేదిక తెలిపింది.
జపాన్‌లో 3.5 శాతం మాత్రమే ఈవీ (Mibot EV) వాహనాలు :
జపాన్ టెక్నాలజీలో ప్రపంచ అగ్రగామిగా ఉన్నా ఎలక్ట్రిక్ వాహనాల్లో వెనుకబడి ఉందని నివేదిక తెలిపింది. 2023లో జపాన్‌లో అమ్ముడైన వాహనాల్లో కేవలం 3.5శాతం మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి.
ప్రపంచ సగటు 18శాతంతో పోలిస్తే.. టయోటా వంటి ప్రధాన తయారీదారులు కూడా ఎలక్ట్రిక్ మొబిలిటీలో వెనకే ఉన్నారు. హైబ్రిడ్‌లు, హైడ్రోజన్-పవర్‌తో నడిచే వాహనాలపై దృష్టి సారించారు. దాంతో జపనీస్ ప్రజలు ఈవీ వాహనాల వైపు పెద్దగా ఆసక్తి చూపించలేదు.
‘కెయి కార్ల’కు ఫుల్ డిమాండ్ :
జపాన్‌లో కెయి కార్లకు ఫుల్ డిమాండ్ ఉంది. చిన్న కార్లు చాలా కాలంగా పాపులారిటీ పొందాయి. తేలికైన డిజైన్, కాంపాక్ట్ సైజు, ధర తక్కువ ఉండటంతో ఎక్కువగా సేల్ అవుతున్నాయి.
2023లో దేశంలోని మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో కెయి కార్లు 55శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇందులో నిస్సాన్ సాకురా అనే మోడల్ 2024లో 23వేల యూనిట్లను విక్రయించింది.
ఈ డిమాండ్ బట్టి బీవైడీ, హ్యుందాయ్ వంటి విదేశీ ఆటోమేకర్లు కూడా జపనీస్ మార్కెట్‌కు అనుగుణంగా కాంపాక్ట్ ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేస్తున్నారు.
మిబోట్ ఈవీ కారులో స్పెషాలిటీ ప్రత్యేకమైన డిజైన్. చిన్న, రోజువారీ ప్రయాణాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సింగిల్-సీటర్ వాహనం. సోలో ప్రయాణికులకు బెస్ట్ ఈవీ కారు అని చెప్పొచ్చు