Gold Silver Price Dropped : గోల్డ్ లవర్స్ కి శుభవార్త.. ఒక్క రోజులోనే రూ. 14,897 తగ్గిన ధర.. అదే బాటలో వెండి
Gold Silver Price Dropped : బంగారం, వెండి ధరలు భారీగా దిగి వచ్చాయి. ఒక్క రోజులోనే సుమారు 15 వేల రూపాయల వరకు ధర తగ్గింది.
on march 23 2026 gold and silver price dropped drastically
Gold Silver Price Dropped :
కొన్ని నెలల క్రితం వరకు కూడా పరుగులు తీసిన వెండి, బంగారం ధరలు ఇప్పుడు దిగి వస్తున్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధర భారీగా దిగి వచ్చింది. 99.9 శాతం స్వచ్ఛమైన పసిడి ధర సోమవారం నాడు రూ. 9,050 తగ్గింది. దీంతో నేడు దేశీయ మార్కెట్లో మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ. 1,43,600కు చేరుకుంది.
కొన్ని రోజుల వరకు కూడా రాకెట్ వేగంతో దూసుకుపోయిన వెండి ధర ఇప్పుడు దిగి వస్తోంది. సోమవారం దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర మీద రూ. 10,500 తగ్గి.. రూ. 2.30 లక్షలకు దిగివచ్చింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో 10 గ్రాముల బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టు (ఏప్రిల్లో డెలివరీ) రేటు భారీగా పతనమైంది. పది గ్రాముల మీద రూ. 14,897 (10.3%) దిగి వచ్చి.. రూ. 1,29,595 వద్దకు పడిపోయింది.
బంగారం ధర ఈ ఏడాది గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ జనవరి 29న బంగారం ధర ఆల్టైమ్ రికార్డుకు చేరుకుంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 1,93,096కి చేరింది. తాజాగా తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు బంగారం ధర రూ. 63,501 (దాదాపు 33 శాతం) తగ్గింది. అంతర్జాతీయ విపణిలో వీటి ధరలు భారీగా తగ్గడమే ఇందుకు కారణం. ఇంటర్నేషనల్ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ ఒక దశలో 474.9 డాలర్లు (10.4 శాతం) క్షీణించి 4,100 డాలర్లకు జారుకుంది. వెండి 61.21 డాలర్లకు పడిపోయింది. గతవారంలోనూ పసిడి 10 శాతానికి పైగా పతనమైంది. గడిచిన 4 దశాబ్దాల్లోకల్లా బంగారానికి ఇది అత్యంత గడ్డు వారమని అంటున్నారు.
కారణాలివే..
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా చమురు ధర భారీగా పెరిగింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో వస్తు, సేవలు మరింత ఖరీదవుతున్నాయి. పెరుగుతున్న ధరలను తగ్గించడానికి.. అమెరికన్ ఫెడ్ రిజర్వ్ సహా ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను మళ్లీ పెంచవచ్చన్న అంచనాలు పెరుగుతుండటంతో.. బంగారం, వెండిలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారు. ఫెడ్ రేట్లకు.. బంగారం, వెండి వంటి ఖరీదైన లోహాల ధరలకు మధ్య విలోమ సంబంధం ఉండటం వల్లే ఇలా జరుగుతుంది. సాధారణంగా ఫెడ్ రేట్లు తగ్గుతున్నప్పుడు బంగారం ధర పెరుగుతూ వస్తుంది. గత రెండేళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతూ వస్తోంది. ఫెడ్ రేట్లు పెరిగితే పసిడి ధర దిగి వస్తుంది.
