Paytm పోస్టు పెయిడ్‌లో EMI ఆప్షన్.. ఇకపై ఒకేసారి చెల్లించనక్కర్లేదు

  • Published By: sreehari ,Published On : November 25, 2020 / 07:42 PM IST
Paytm పోస్టు పెయిడ్‌లో EMI ఆప్షన్.. ఇకపై ఒకేసారి చెల్లించనక్కర్లేదు

Updated On : November 25, 2020 / 8:41 PM IST

Paytm postpaid flexible EMI options : ప్రముఖ డిజిటల్ వ్యాలెట్ సర్వీస్ ప్రొవైడర్ పేటీఎం తమ పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. పోస్టు పెయిడ్ వాడే కస్టమర్లు ఇకపై ఒకేసారి పేమెంట్ చేయాల్సిన పనిలేదు. వాయిదాల పద్ధతిలో పేమెంట్ చేసుకోవచ్చు.. అదేనండీ..



తీసుకున్న మొత్తాన్ని నెలవారీ ఈఎంఐలుగా చెల్లించవచ్చు. ఇప్పటివరకూ పేటీఎం పోస్టు పెయిడ్‌ క్రెడిట్ లిమిట్‌ నుంచి ఏమైనా ఖర్చు చేస్తే.. ఆ మొత్తాన్ని నిర్దిష్ట గడువులోగా ఒకేసారి చెల్లించాల్సి వచ్చేది. అది కూడా బిల్లు జనరేట్ అయిన మొదటి ఏడు రోజుల్లోగా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. గడవులోగా చెల్లించకుంటే వడ్డీ విధిస్తోంది.

ఇకపై తీసుకున్న ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించనక్కర్లేదు అంటోంది పేటీఎం సంస్థ. తీసుకున్న మొత్తాన్ని ఈఎంఐలుగా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటోంది. అందుకోసం ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్లు తీసుకొచ్చింది. అంతేకాదు.. ఈఎంఐలపై తక్కువ వడ్డీనే వసూల్ చేయనుంది.



పేటీఎం ద్వారా ఇప్పుడే కొనండి.. తరువాత చెల్లించండి (బీ ఎన్ పీ ఏల్) అనే సౌకర్యాన్ని అందిస్తోంది. ఐదు లక్షలకు పైగా ప్రొడక్టులతో సర్వీసులకు ఐదు లక్షలకు పైగా ప్లస్ షాపులు, వెబ్‌సైట్లలో పొందవచ్చు.

ప్రస్తుతం పేటీఎంలో రూ .1 లక్ష వరకు క్రెడిట్ లిమిట్ అందిస్తోంది. పోస్టు పెయిడ్ నుంచి తీసుకున్న మొత్తాన్ని EMI రూపంలో సకాలంలో తిరిగి చెల్లించాలి. అలా చేసినవారికి ఈ లిమిట్‌ను మరింత పెంచుతామని పేటీఎం పేర్కొంది.



పేటీఎం పోస్ట్ పెయిడ్ లైట్, డిలైట్, ఎలైట్ (Lite, Delite, Elite) అనే మూడు వేర్వేరు విభాగాలలో సర్వీసులను అందిస్తోంది. పోస్ట్‌పెయిడ్ లైట్ రూ. 20,000 లిమిట్.. డెలైట్, ఎలైట్ క్రెడిట్ లిమిట్‌ను రూ. 1,00,000 క్రెడిట్ లిమిట్ అందిస్తోంది.

లైట్ లిమిట్ కస్టమర్లకు ఎలాంటి క్రెడిట్ స్కోరుతో పనిలేకుండా ఇన్ స్టంట్ క్రెడిట్ లిమిట్ రూ. 20,000 వరకు అందిస్తోంది. పోస్టుపెయిడ్ నుంచి నెలవారీ ఖర్చులను బట్టి పేటీఎం ఆయా కస్టమర్లకు డెలైట్, ఎలైట్ కింద రూ. లక్ష లిమిట్ అందిస్తోంది.



ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించి ప్రతి నెలా ఒక బిల్లు జనరేట్ అవుతుంది. బిల్లు జనరేట్ అయిన మొదటి ఏడు రోజుల్లో కస్టమర్లు పోస్ట్‌పెయిడ్ మొత్తం బిల్లును సులభమైన ఈఎంఐలుగా మార్చుకోవచ్చు.

మరో అదనపు సౌకర్యం కూడా అందిస్తోంది. పోస్ట్‌పెయిడ్ బిల్లును యుపిఐ, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్‌ నుంచి తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తోంది.