మధ్యంతర బడ్జెట్ : బ్యాంకుల సీఈఓలతో గోయల్ మీటింగ్

ఢిల్లీ : మధ్యంతర బడ్జెట్ కొద్ది రోజుల్లో రానుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కీలకమైన మధ్యంతర బడ్జెట్‌కు మూడు రోజుల ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో సమావేశం కానున్నారు. జనవరి 28వ తేదీ సోమవారం ఈ సమావేశం జరుగనుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సైతం హాజరవుతారని తెలుస్తోంది. ఎంఎస్ఎంఈ, సాగు రంగానికి రుణ వితరణ ఏ విధంగా ఉంది ? ప్రభుత్వ పథకాల పనితీరు, గవర్నమెంట్ బ్యాంకుల పనితీరు తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించనున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్‌పీఏలు రూ. 9.62 లక్షల కోట్ల నుండి రూ. 23 వేల కోట్ల మేర తగ్గాయని అంచనా. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యంతో అమెరికాలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనితో ఆ బాధ్యతలను పీయూష్ గోయల్ చూసుకుంటున్నారు. సోమవారం రోజు జరిగే సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయి…ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో తదితర వివరాలు భేటీ అనంతరం తెలియనున్నాయి.