మరింత చౌకగా SBI గృహ రుణాలు…వడ్డీ రేట్లు తగ్గింపు

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) కస్టమర్లకు శుభవార్త చెప్పింది. వరుసగా తొమ్మిదోసారి వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ బ్యాంకు ఇచ్చే గృహ, వాహన, రిటైల్ రుణాలు మరింత చౌక కానున్నాయి. రుణ రేటు ఆధారిత ఫండ్స్ మార్జినల్ కాస్ట్ (MCLR)రేటు 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గించినట్లు బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం ఎంసిఎల్‌ఆర్ రేటు 7.90గా ఉంది. ఇందులో 5 బేసిస్ పాయింట్లు తగ్గించి తాజాగా 7.85కు చేర్చింది.
తాజా ఎంసీఎల్ఆర్ రేటు తగ్గింపు నిర్ణయం ఫిబ్రవరి 10వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని ఎస్ బీఐ తెలిపింది. ఎంసీఎల్ఆర్ రేటును మాత్రమే కాకుండా ఫిక్స్‌డ్ డిపాజిజ్ రేట్లు కూడా ఎస్ బీఐ తగ్గించేసింది. ఎఫ్‌డీ రేట్లను 10 నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. దీంతో బ్యాంక్‌లో డబ్బు ఎఫ్‌డీ చేయాలని భావించే వారికి తక్కువ రాబడి వస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల తగ్గింపునకు ఎస్‌బీఐ వివరణ ఇచ్చింది. వ్యవస్థలో లిక్విడిటీ ఎక్కువగా ఉందని, అందుకే వడ్డీ రేట్లను సవరించామని తెలిపింది. అందుకే రూ.2 కోట్లలోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు తగ్గించామని తెలిపింది.
స్టేట్ బ్యాంక్ దేశంలోనే అదిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతోంది. డిపాజిట్లు, బ్రాంచులు, కస్టమర్లు, ఉద్యోగులు ఇలా ఏ విధంగా చూసినా ఎస్‌బీఐనే పెద్ద బ్యాంక్. 2019 డిసెంబర్ 31 నాటికి ఈ బ్యాంక్‌లో రూ.31 లక్షల కోట్లకు పైనే డిపాజిట్లు ఉన్నాయి. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు గమనిస్తే.. 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై 4.5 శాతం, 46 నుంచి 179 రోజుల ఎఫ్‌డీలపై 5 శాతం వడ్డీ వస్తుంది. 180 నుంచి 210 రోజుల ఎఫ్‌డీలపై 5.5 శాతం, 211 నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై కూడా 5.5 శాతం వడ్డీనే లభిస్తుంది. అదేసమయంలో ఏడాది నుంచి ఆపైన ఎఫ్‌డీలపై 6 శాతం వడ్డీ వస్తుంది. సాధారణ బ్యాంక్ కస్టమర్ల కన్నా సీనియర్ సిటిజన్స్‌కు ఎస్ బీఐ ఎక్కువ వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్స్ 50 బేసిస్ పాయింట్ల మేర ఎక్కువ వడ్డీ పొందొచ్చు. అంటే వీరికి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5 శాతం నుంచి 6.5 శాతం వరకు వడ్డీ వస్తుంది.