BYD Unit : మన హైదరాబాద్‌లో BYD కోసం 200 ఎకరాలు.. కొత్త ప్లాంట్ ఇక్కడే..?
BYD Unit : హైదరాబాద్ శివార్లలోని షాబాద్ మండలంలోని చందన్‌వెల్లి వద్ద 200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.

Telangana govt identifies 200 acres for BYD unit
BYD Unit : మన హైదరాబాద్ ఎలక్ట్రినిక్ వెహికల్స్ హబ్‌గా మారుతోంది. ప్రపంచంలోనే నెంబర్ వన్ ఈవీ సంస్థ, చైనా ఆటోమోటివ్ దిగ్గజం (BYD) కంపెనీ తెలంగాణలోని హైదరాబాద్ సమీపంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీకి యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటుతో త్వరలో లక్షల్లో ఉద్యోగాలు రానున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాలకు తెలంగాణ ప్రభుత్వం అనేక రాయితీలు కూడా ఇస్తోంది. తద్వారా భారత మార్కెట్లో ఈవీ రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది. ఈ క్రమంలో తెలంగాణలోకి BYD కంపెనీని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.
200 ఎకరాల భూమి కేటాయింపు :
ఇందులో భాగంగానే ప్రతిపాదిత ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్రాజెక్టు కోసం 200 ఎకరాల భూమిని గుర్తించింది. హైదరాబాద్ శివార్లలోని షాబాద్ మండలంలోని చందన్‌వెల్లి వద్ద 200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.
అయితే, ఈ ప్రాజెక్ట్ భారత్‌లోకి ప్రవేశించాలంటే.. ముందుగా భారత్, చైనా ప్రభుత్వాల నుంచి అనుమతులు తప్పనిసరి. “ఫైనల్ అప్రూవల్, భూమి ఖరారు, ఒప్పందాలకు కనీసం ఒక సంవత్సరం పట్టనుంది. ప్లాంట్ ఏర్పాటుకు కూడా మరో 3 ఏళ్లు పట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
2020 నుంచి గల్వాన్ సరిహద్దులో భారత్, చైనా దళాలు ఘర్షణ పడిన తర్వాత భద్రతా సమస్యలు తలెత్తాయి. అయితే, బీవైడీ హైదరాబాద్‌కు చెందిన మేఘ ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) గ్రూప్ కలిసి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కార్లను తయారీకి ప్రతిపాదించిన ప్రతిపాదిత జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్‌ను 2023 మధ్యలో భారత ప్రభుత్వం తిరస్కరించింది. దాదాపు రెండు ఏళ్ల తర్వాత ఇప్పుడు BYD తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది.
ఏడాదికి 10వేల నుంచి 15వేల ఈవీ కార్లు :
రెండు దేశాల మధ్య సంబంధాలు సన్నగిల్లిన నేపథ్యంలో చైనాపై భారత ప్రభుత్వ వైఖరిని మృదువుగా చేయడం ద్వారా మేఘ గ్రూప్, BYD జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ పునరుద్ధరణకు ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలంగాణ ప్రభుత్వ అధికారులు తెలిపారు.
BYD e6 మల్టీ-యుటిలిటీ వెహికల్‌తో ప్రారంభించి సంవత్సరానికి 10వేల నుంచి 15వేల ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ జాయింట్ వెంచర్ ద్వారా ఒక బిలియన్ డాలర్ పెట్టుబడి పెట్టాలని మేఘ గ్రూప్, BYD గతంలో కేంద్రం ముందు ఒక ప్రతిపాదనను సమర్పించాయి.
తెలంగాణ ప్రభుత్వం BYD ప్లాంట్ కోసం ఇప్పుడు గుర్తించిన స్థలం సీతారాంపూర్‌లోని 150 ఎకరాల భూమికి దగ్గరగా ఉంది. ఇక్కడ మేఘా గ్రూప్ EV తయారీ సంస్థ, (Olectra Greentech) e-బస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. 2030 వరకు ఎలక్ట్రిక్ బస్సుల తయారీ, నిర్వహణ కోసం ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ ఇప్పటికే BYDతో సాంకేతిక సహకారాన్ని కలిగి ఉంది.
త్వరలో సీతారాంపూర్‌లోని కొత్త e-బస్ తయారీ ప్లాంట్‌లో పాక్షికంగా ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. కొత్త e-బస్ ప్లాంట్ ఈ ఏడాది చివరి నాటికి 5వేల e-బస్సులను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వచ్చే ఏడాది 10వేల యూనిట్లకు పెంచాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.