Largest Gold Reserves : వామ్మో.. టన్నుల కొద్ది బంగారం.. అత్యధిక బంగారు నిల్వలు కలిగిన టాప్ 10 దేశాలివే.. భారత్ ర్యాంకు ఎక్కడంటే?
Largest Gold Reserves : టన్నుల కొద్ది బంగారు నిల్వలు.. ఏ దేశంలో ఎక్కువంటే.. అమెరికా అగ్రస్థానంలో ఉంటే.. చైనా 5వ స్థానంలో నిలిచింది. మన భారత్ స్థానం ఎక్కడో తెలుసా?

Largest Gold Reserves
Largest Gold Reserves : బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ ప్రపంచవ్యప్తంగా బంగారానికి ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. భారత్ సహా పలు దేశాల్లో బంగారు నిల్వలకు కూడా అంతే స్థాయిలో డిమాండ్ పెరిగిపోయింది. వాస్తవానికి.. 2025 ప్రారంభం నుంచి బంగారం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఇటీవలే బంగారం ధర కొత్త ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది.
ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదించిన ప్రకారం.. ఈ సంవత్సరం ఇప్పటివరకు బంగారం ధరలు 23శాతంగా నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే.. 50శాతం, 3 ఏళ్లలోపు వంద శాతం మేర పెరిగాయి. ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం (ఏప్రిల్ 22) బంగారం ధరలు 3,400 డాలర్లు దాటాయి. డాలర్ బలహీనపడటం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ ప్రణాళికలతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
లక్ష మార్క్ దాటేసిన బంగారం :
సాధారణంగా భారత్ బులియన్ మార్కెట్ అంతర్జాతీయ ధరలను బట్టి హెచ్చుతగ్గుదల ఉంటుంది. మొదటిసారిగా, బంగారం ధరలు 10 గ్రాములకు రూ.1 లక్ష స్థాయి కన్నా ఎక్కువగా ఎగబాకాయి. 2024 నాలుగో త్రైమాసికంలో కేంద్ర బ్యాంకులు బంగారాన్ని భారీ మొత్తంలో సేకరించాయి. ఈ త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లు 333 టన్నులకు పెరిగాయి. వరుసగా మూడో సంవత్సరం వార్షిక బంగారం కొనుగోళ్లు వెయ్యి టన్నులకు పైగా పెరిగాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది.
అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థికానికి అవసరమైన బంగారు నిల్వలు ఇప్పటికీ చాలా దేశాల్లో పేరుకుపోయాయి. ఈ బంగారం నిల్వలతో దేశీయంగా మరింత విలువను పెంచుతోంది. ప్రపంచ ఆర్థిక స్థితిలో దేశీయ స్థానాన్ని బంగారం తీవ్ర ప్రభావితం చేస్తుంది.
బంగారు నిల్వల్లో అమెరికా టాప్.. :
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇటీవలి డేటా ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్ ప్రపంచవ్యాప్తంగా బంగారు నిల్వలలో అగ్రస్థానంలో ఉంది. అగ్రరాజ్యం మొత్తం 8,133.46 టన్నులు కలిగి ఉంది. దీని విలువ సుమారు 682,276.85 మిలియన్లు అనమాట. ఆ తరువాతి 3 అతిపెద్ద బంగారు నిల్వలు కలిగిన జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌ల మొత్తం బంగారం నిల్వలకు దాదాపు సమానంగా ఉంటుంది.
చైనాకు 5వ స్థానం.. ఏడో స్థానంలో భారత్ :
2024లో అతిపెద్ద బంగారం కొనుగోలుదారుగా పేరొందిన పోలాండ్, బంగారు నిల్వలను 89.54 టన్నుల వరకు పొగేసింది. ఇప్పుడు ఆ బంగారు నిల్వలు పెరిగి ప్రపంచవ్యాప్తంగా 10వ స్థానంలో నిలిచింది. భారతీయ సంస్కృతిలో బంగారానికి అత్యంత ముఖ్యమైన స్థానం ఉంది.
దేశంలో తరతరాలుగా బంగారం పేరుకుపోతుంది. ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనా 5వ స్థానంలో నిలవగా, స్విట్జర్లాండ్ 6వ స్థానంలో ఉంది.
భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) సైతం బంగారు నిల్వలకు సుమారు 72.60 టన్నులను చేర్చింది. 2024లో పోలాండ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద బంగారం కొనుగోలుదారుగా భారత్ నిలిచింది. దాంతో భారతదేశంలో మొత్తం బంగారు నిల్వలు 876.18 టన్నులకు చేరుకున్నాయి. భారత్ బంగారు నిల్వలతో 7వ స్థానంలో నిలిచింది. మరోవైపు.. చైనా కూడా బంగారు నిల్వలను 44.17 టన్నులతో 5వ స్థానంలో నిలిచి రష్యాను అధిగమించింది.
2024-25లో అత్యధిక బంగారు నిల్వలు కలిగిన టాప్ 10 దేశాలు :
ర్యాంక్ | దేశం | బంగారు నిల్వలు (టన్నులు) | బంగారు నిల్వలు (మిలియన్లలో) |
1. | అమెరికా సంయుక్త రాష్ట్రాలు | 8,133.46 | 682,276.85 |
2 | జర్మనీ | 3,351.53 | 281,143.57 |
3 | ఇటలీ | 2,451.84 | 205,672.74 |
4 | ఫ్రాన్స్ | 2,437.00 | 204,428.20 |
5 | చైనా | 2,279.56 | 191,220.94 |
6 | స్విట్జర్లాండ్ | 1,039.94 | 87,235.26 |
7 | భారతదేశం | 876.18 | 73,498.28 |
8 | జపాన్ | 845.97 | 70,964.60 |
9 | నెదర్లాండ్స్ | 612.45 | 51,375.79 |
10 | పోలాండ్ | 448.23 | 37,600.03 |