Gold Prices: ఏప్రిల్‌ నెలలో బంగారం ధరలు దడదడలాడిస్తాయా? ఇలాగైతే ఎలా? 

దీర్ఘకాలికంగా చూస్తే బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Gold Prices: ఏప్రిల్‌ నెలలో బంగారం ధరలు దడదడలాడిస్తాయా? ఇలాగైతే ఎలా? 

Updated On : April 2, 2025 / 3:07 PM IST

దేశంలో బంగారం ధరలు మార్చి నెలలో జీవితకాల గరిష్ఠ స్థాయులకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి చివరి వారంలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.90,660కి చేరుకోగా, ఎంసీఎక్స్‌ బంగారం సరికొత్త గరిష్ఠ స్థాయి (రూ.89,946)ని తాకింది. అంతర్జాతీయంగా COMEX బంగారం కూడా ఒక్క ఔన్సుకి 3057.31 డాలర్లకు చేరింది. ఇతర పెట్టుబడి మార్గాల కంటే బంగారంపై పెట్టుబడులపైనే ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు.

ఏప్రిల్‌లో కూడా ఈ వృద్ధి కొనసాగుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధాన కారణం అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అమలు చేయబోయే సుంకాల విధానాలే. ఏప్రిల్ 2న ఆయన విధించే కొత్త సుంకాలు బంగారం మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-గాజా మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు కూడా బంగారం ధరలకు పెరుగుదలకు కారణంగా నిలుస్తున్నాయి.

అమెరికా డాలర్ విలువ, ట్రెజరీ బాండ్ తాకట్టు రాబడి, వడ్డీ రేట్ల తగ్గింపుపై ఊహాగానాలలతో కూడిన ఆర్థిక పరిస్థితులు కూడా బంగారం ధరను ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచ బంగారం మండలి (WGC) ప్రకారం.. ఏప్రిల్ 2న అమెరికా ఆంక్షలను ప్రకటించిన తర్వాత బంగారం కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. “బంగారం ఇప్పటికే ఔన్సుకు $3,000కి పైగా ధరతో కొనసాగుతోంది. తాత్కాలిక స్థాయిలో ధరలు స్థిరపడే అవకాశం ఉంది” అని WGC నివేదిక తెలియజేస్తోంది.

దీర్ఘకాలికంగా చూస్తే, బంగారం ధరల పెరుగుదల ధోరణి కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. డాయిచ్ బ్యాంక్ గ్లోబల్ CIO క్రిస్టియన్ నోల్టింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. 2025 ప్రారంభం నుంచి బంగారం ధరలు వరుసగా కొత్త గరిష్ఠాలను చేరుకుంటున్నాయి. ప్రధానంగా ఆసియా దేశాలు, కేంద్ర బ్యాంకుల నుంచి డిమాండ్ బలంగా ఉంది.

రాజకీయ అస్థిరత, ముఖ్యంగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంక్షోభం వంటి పరిస్థితుల్లో బంగారం ఒక “సురక్షిత ఆస్తి”గా మారుతోంది. అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్‌లో బలమైన లాంగ్ పొజిషనింగ్ ఉండడంతో కొంతకాలం లాభాల స్వీకరణకు పెట్టుబడిదారులు మొగ్గుచూపవచ్చు. కానీ, దీర్ఘకాలికంగా చూస్తే బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.