Village of one kidney: దారుణం.. ఆ గ్రామంలో సింగిల్ కిడ్నీతో బతుకుతున్న జనాలు.. సంచలన విషయాలు వెల్లడి
ఆమె, ఆమె భర్త ఇద్దరూ కిడ్నీలు అమ్ముకున్నారు. రూ.7 లక్షలు ఇస్తామని నమ్మించి, చివరికి చేతిలో పెట్టింది కేవలం రూ.3 లక్షలు. అనారోగ్యంతో జీవచ్ఛవంలా..

బంగ్లాదేశ్‌లోని జాయ్‌పూర్హాట్ జిల్లా బైగుని గ్రామం.. ఓ సాధారణ పల్లెటూరు. ఇప్పుడు దీనిని అందరూ ‘కిడ్నీ విలేజ్’ అని పిలుస్తున్నారు. పేదరికం, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఇక్కడి ప్రజలే బ్రోకర్లకు లక్ష్యంగా మారారు. కిడ్నీలు అమ్మాలని, డబ్బులు వస్తాయని వారిని బ్రోకర్లు ప్రోత్సహిస్తున్నారు.
పేదరికం నుంచి కాస్తోకూస్తో బయటపడాలన్న ఆశతో, తమ శరీరంలోని అవయవాలను అమ్ముకుని, జీవితాంతం నరకం అనుభవిస్తున్నారు ఆ గ్రామంలోని వందలాది మంది.
చట్టవిరుద్ధంగా సాగుతున్న ఈ కిడ్నీ రాకెట్ వెనుక ఉన్న చీకటి కోణాలు, బ్రోకర్ల మాయమాటలు, బాధితుల కన్నీటి గాథలు ఇప్పుడు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి.
బంగ్లాదేశ్‌లోని బైగుని గ్రామ ప్రజల వద్దకు బ్రోకర్లు వెళ్లి “మీకు లక్షలు వస్తాయి, మీ కష్టాలు తీరిపోతాయి” అని చెబుతున్నారు. “అంతా చట్టబద్ధంగానే జరుగుతుంది, మేం చూసుకుంటాం” అని నమ్మబలుకుతున్నారు. నకిలీ పత్రాలు, మాయమాటలతో ఆ అమాయకులను ఇండియాకు తరలిస్తున్నారు.
నా కుటుంబం కోసం నా కిడ్నీ ఇచ్చాను: బాధితుడు సఫీరుద్దీన్
తన ముగ్గురు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, ఒక ఇల్లు కట్టుకోవాలని కలలు కన్నాడు సఫీరుద్దీన్. రూ.3.5 లక్షలు ఇస్తామని, కిడ్నీ అమ్మాలని బ్రోకర్లు చెప్పిన మాటలలు విని, తన కిడ్నీని అమ్మాడు. కానీ ఆ డబ్బు నీటిలా కరిగిపోయింది. ఇల్లు పూర్తి కాలేదు, కానీ కిడ్నీ తీసిన చోట నొప్పి మాత్రం శాశ్వతంగా మిగిలిపోయింది.
ఇప్పుడు అతడు సాధారణ కూలీ పని కూడా చేయలేక, ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని నరకం చూస్తున్నాడు. “నా కుటుంబం కోసం నా కిడ్నీ ఇచ్చాను. కానీ ఇప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు” అని చెబుతున్నాడు సఫీరుద్దీన్.
మోసపోయిన మహిళ
జోస్నా బేగం కథ ఇంకా దారుణం. ఆమె, ఆమె భర్త ఇద్దరూ కిడ్నీలు అమ్ముకున్నారు. రూ.7 లక్షలు ఇస్తామని నమ్మించి, చివరికి చేతిలో పెట్టింది కేవలం రూ.3 లక్షలు. ఆపరేషన్ తర్వాత బ్రోకర్లు మాయమయ్యారు. వైద్యం అందలేదు, కట్టుకున్న భర్త కూడా ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆమె ఒంటరిగా, అనారోగ్యంతో జీవచ్ఛవంలా బతుకుతోంది.
బాధితులే బ్రోకర్లుగా మారుతున్న వైనం
ఈ రాకెట్‌లో అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, ఒకప్పుడు మోసపోయిన బాధితులే డబ్బు కోసం ఇప్పుడు బ్రోకర్లుగా మారుతున్నారు. అప్పులపాలై కిడ్నీ అమ్ముకున్న మొహమ్మద్ సజల్ వంటి వారు, తమలాగే ఇబ్బందుల్లో ఉన్న ఇతరులను గుర్తించి, వారిని ఈ ఊబిలోకి లాగుతున్నారు. ఇది ఒక విషవలయంగా మారింది.
చట్టం ఏం చేస్తోంది?
ఈ వ్యవహారంపై బంగ్లాదేశ్, భారత ప్రభుత్వాలు దర్యాప్తు చేస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో పలువురు బ్రోకర్లను అరెస్ట్ చేశారు. భారతదేశంలో ఢిల్లీకి చెందిన డాక్టర్ విజయ రాజకుమారి వంటి వారిపై ఆరోపణలు రావడంతో దర్యాప్తు కొనసాగుతోంది.
ఇండియాలో రక్త సంబంధీకులు కాని వారికి అవయవదానం చేయడం చట్టవిరుద్ధం. కానీ బ్రోకర్లు నకిలీ డీఎన్‌ఏ రిపోర్టులు, ఫ్యామిలీ ట్రీలు సృష్టించి వైద్యులను, అధికారులను మోసం చేస్తున్నారు.
బ్రిటిష్ మెడికల్ జర్నల్ (BMJ) ప్రకారం.. కలాయ్ ఉపజిల్లాలో ప్రతి 35 మందిలో ఒకరు తమ కిడ్నీని అమ్ముకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పరిష్కారం ఏమిటి?
ప్రభుత్వాలు ‘మెడికల్ టూరిజం’ ద్వారా వచ్చే ఆదాయానికి ప్రాధాన్యం ఇస్తున్నంత కాలం, ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడం కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. కఠినమైన చట్టాలు, సరిహద్దుల్లో నిఘా పెంచడంతో పాటు, పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు కృషి చేసినప్పుడే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట పడుతుంది.
లేకపోతే, సఫీరుద్దీన్ లాంటి ఎందరో అమాయకులు తమ జీవితాలను పణంగా పెడుతూనే ఉంటారు. వారి ఆశలు, కలలు ఆపరేషన్ థియేటర్‌లోనే సమాధి అవుతూనే ఉంటాయి.