వీళ్లకు వారసుల ఫ్యూచర్ కంటే కంపెనీ ఫ్యూచరే ఇంపార్టెంట్.. లక్షల కోట్ల విలువైన కంపెనీలు బయటి వారి చేతుల్లోకి…
వారెన్ బఫెట్ మాత్రమే కాదు.. ప్రపంచంలోని ఎన్నో దిగ్గజ కంపెనీల యజమానులు కూడా తమ పిల్లలను సీఈవో కుర్చీలో కూర్చోబెట్టకుండా.. చాలా అనుభవం, టాలెంట్ ఉన్న ఇతర వ్యక్తులకు ఆ బాధ్యతలు అప్పజెప్పారు.

లెజెండరీ బిలియనీర్ వారెన్ బఫెట్ (94) ఈ ఏడాది చివరి నాటికి బెర్క్‌షైర్ హాత్వేలో లీడర్‌షిప్ రోల్ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. అంటే.. బెర్క్‌షైర్ హాత్‌వే సీఈవో పదవి నుంచి తప్పుకుంటానంటూ తన రిటైర్మెంట్ ప్లాన్‌ను ఆయన తెలిపారు. కంపెనీ వార్షిక వాటాదారుల సమావేశంలో ఆయన దీనిని ప్రకటించారు.
అలాగే, ఆ కంపెనీలో చాలా అనుభవం ఉన్న కెనడియన్ ఎగ్జిక్యూటివ్ గ్రెగ్ అబెల్‌ను బెర్క్‌షైర్ హాత్వేకు సీఈవోగా నియమించాలని సిఫార్సు చేశారు. వారెన్ బఫెట్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ, వారిలో ఒకరి పేరును సీఈవోగా సిఫార్సు చేయకుండా గ్రెగ్ అబెల్ పేరును ప్రతిపాదించారు.
వారెన్ బఫెట్ మాత్రమే కాదు.. ప్రపంచంలోని ఎన్నో దిగ్గజ కంపెనీల యజమానులు కూడా తమ పిల్లలను సీఈవో కుర్చీలో కూర్చోబెట్టకుండా.. చాలా అనుభవం, టాలెంట్ ఉన్న ఇతర వ్యక్తులకు ఆ బాధ్యతలు అప్పజెప్పారు. మైక్రోసాఫ్ట్, ఫోర్డ్ మోటార్స్, లెవిస్, టయోటా, ఇన్ఫోసిస్ ఇదే మార్గంలో నడిచాయి. ఆ కంపెనీల యజమానుల అంచనాలకు తగ్గట్టుగానే సీఈవోలు పనిచేస్తూ ఆయా కంపెనీల మార్కెట్ విలువను భారీగా పెంచుతున్నారు.
మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్‌లో కూడా కంపెనీ వ్యవహారాలను ఒకే ఫ్యామిలీ చూసుకోవాలన్న సాంప్రదాయం లేదు. బిల్ గేట్స్ 1975లో మైక్రోసాఫ్ట్‌ను స్థాపించారు. ఆయన 2000 వరకు సీఈవోగా పనిచేశారు. అనంతరం స్టీవ్ బాల్మెర్ సీఈవోగా ఉన్నారు. 2014లో సత్యనాదెళ్ల సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు.
ఫోర్డ్ మోటార్ కంపెనీ
హెన్రీ ఫోర్డ్ ఈ కంపెనీని స్థాపించారు. ఆయనకు ముగ్గురు మనవళ్లు ఉన్నారు. అయినప్పటికీ, వారు ముగ్గురిలో ఏ ఒక్కరూ ఆ కంపెనీకి సీఈవోగా లేరు. ప్రస్తుతం ఆ కంపెనీ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా జిమ్ ఫర్లే ఉన్నారు. ఆయనను 2020 అక్టోబర్ 1న ఈ పదవిలో ఆ కంపెనీ కూర్చోబెట్టింది. అయితే, ఫోర్డ్ మోటార్ కంపెనీ ఛైర్మన్‌గా మాత్రం హెన్రీ ఫోర్డ్ మనవడు విలియం క్లే ఫోర్డ్ జూనియర్ కొనసాగుతున్నారు.
లెవిస్
ఈ కంపెనీని లెవి స్ట్రాస్ 1853లో స్థాపించారు. ఆయన అసలు పెళ్లే చేసుకోలేదు. స్ట్రాస్‌కు కొడుకు, కూతురు వంటి వారసులు లేకపోవడంతో ఆయన తర్వాత మేనల్లుళ్లు కంపెనీ బాధ్యతలను చూసుకుంటున్నారు. కంపెనీ లీడర్‌షిప్ బాధ్యతలను మాత్రం ఇతరులను అప్పజెప్పుతున్నారు. ప్రస్తుతం లెవి స్ట్రాస్ సీఈవోగా మిచెల్ గాస్ ఉన్నారు.
టయోటా
ఈ కంపెనీని 1937, ఆగస్టు 28న కిచిరో టయోడా స్థాపించారు. ఆయన మనవడు అకియో టయోడానే ఆ కంపెనీకి వారసుడు. 2009లో ఆ కంపెనీ ప్రెసిడెంట్, సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. 2023లో ఆయన సీఈవో పదవి నుంచి వైదొలిగి చైర్మన్ అయ్యారు. సీఈవోగా కోజి సాటోను నియమించారు.
ఇన్ఫోసిస్
భారత్‌కు చెందిన ఇన్ఫోసిస్‌కు కూడా సంప్రదాయ వారసుడు లేడు. అటువంటి సంప్రదాయన్ని ఈ సంస్థ పాటించదు. ఇన్ఫోసిస్‌ను నారాయణ మూర్తి 1981లో స్థాపించారు. అప్పట్లో సీఈవోగా, ఛైర్మన్‌గా పనిచేశారు. ఆ తరువాత 2013లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మారారు. ఆయన కూతురి పేరు అక్షత మూర్తి, కొడుకు పేరు రోహన్ మూర్తి. ప్రస్తుతం ఇన్ఫోసిస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా సలీల్ పరేఖ్ ఉన్నారు. ఆయన 2018లో ఆ బాధ్యతలు స్వీకరించారు.