జొమాటో సీఈవో దీపిందర్ నుదుటి పక్కన పెట్టుకున్న ఈ డివైజ్ ఏంటి? వామ్మో.. దీనికి అంత సీన్ ఉందా?
ఈ పరిశోధన ముందుకు సాగేందుకు దీపిందర్ సుమారు 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ.225 కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి.
Deepinder Goyal (Image Credit To Original Source)
- ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిందర్ గోయల్
- వెండి లోహ రంగులో కనిపిస్తున్న క్లిప్‌లాంటి డివైజ్
- మెదడులో రక్త ప్రవాహాన్ని రియల్ టైమ్‌లో గుర్తిస్తుంది
Deepinder Goyal: భారతీయ వ్యాపారవేత్త, పాడ్‌కాస్టర్ రాజ్ షామానీ తాజాగా జొమాటో సీఈవో దీపిందర్ గోయల్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా దీపిందర్ గోయల్ నుదిటి పక్కన పెట్టుకుని వచ్చిన ఓ చిన్న డివైజ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ డివైజ్ గురించి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కొందరు దానిని నమిలే గమ్‌లా ఉందంటున్నారు. ఇంకొందరు అది ప్యాచ్ అని, చార్జింగ్ ప్యాడ్ అని కూడా అన్నారు.
అయితే దీపిందర్ గోయల్ నుదుటిపై ఉన్న డివైజ్ ఏంటో తెలుసా? వెండి లోహ రంగులో కనిపించే క్లిప్‌లాంటి ఈ డివైజ్ పేరు టెంపుల్. ఇది ప్రయోగాత్మక వేరబుల్. ఇది మెదడులో రక్త ప్రవాహాన్ని (రక్త పరిమాణం, వేగాన్ని) రియల్ టైమ్‌లో గుర్తిస్తుంది.
మెదడులో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చా?
మెదడులో రక్తం ఎలా ప్రసరిస్తోందో నిరంతరం గుర్తిస్తే ఎన్నో ఆరోగ్య లాభాలు ఉంటాయి. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. ఈ సమాచారాన్ని నమోదు చేస్తే వయస్సు పెరిగే కొద్దీ మన మెదడులో ఏం జరుగుతుందో అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
దీపిందర్ గోయల్ కేవలం ఈ పోడ్‌కాస్ట్ కోసం మాత్రమే ఈ డివైజ్‌ను పెట్టుకువచ్చారని అనుకుంటే పొరపాటే. సుమారు ఒక సంవత్సరం పాటు ఆయన ఈ డివైజ్‌ను స్వయంగా పరీక్షిస్తున్నారు.
దీపిందర్ పోస్టులు, ఇంటర్వ్యూల్లో తెలిపిన వివరాల ప్రకారం.. ఆయనకు గ్రావిటీ ఏజింగ్ హైపోథసిస్ అనే సిద్ధాంతంపై పనిచేస్తున్న సమయంలో “టెంపుల్” డివైజ్ ఆలోచన వచ్చింది. గ్రావిటీ ఏజింగ్ హైపోథసిస్ అంటే గురుత్వాకర్షణ దీర్ఘకాలంలో రక్త ప్రసరణపై చూపే ప్రభావం వృద్ధాప్యాన్ని ప్రభావితం చేస్తుందనే సిద్ధాంతం. వృద్ధాప్యం ఎందుకు సంభవిస్తుంది? మనిషి దేహంలోని కణాలు, అవయవాలు ఎలా క్షీణిస్తాయి? అనేదానిని వివరిస్తుంది.
“కంటిన్యూ రీసెర్చ్”లో భాగంగా “టెంపుల్” అభివృద్ధి
ఈ “టెంపుల్” వేరబుల్‌ను దీపిందర్ గోయల్ స్వయంగా ప్రారంభించిన వ్యక్తిగత పరిశోధనా ప్రోగ్రాం “కంటిన్యూ రీసెర్చ్”లో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఆయన సొంత నిధులతో సాగుతున్న పరిశోధన.
ఈ పరిశోధన ముందుకు సాగేందుకు ఆయన సుమారు 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ.225 కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి. “టెంపుల్” ఇప్పటికీ ప్రయోగ దశలోనే ఉంది. అయినా ఆన్‌లైన్‌లో ఇది కనపడడంతో కొందరు మీమ్స్ సృష్టిస్తున్నారు.
మెదడు ఆరోగ్యాన్ని గమనించే వేరబుల్ సెన్సార్లపై ప్రస్తుతం పరిశోధనలు చాలా చురుకుగా జరుగుతున్నాయి. అయితే, ఇలాంటి డివైజ్‌లు సాధారణంగా ప్రయోగశాలలు లేదా ప్రారంభ పరీక్ష దశలకే పరిమితం అవుతున్నాయి.
గ్రావిటీ ఏజింగ్ ఆలోచనపై గోయల్ ఆన్‌లైన్‌లో మరిన్ని వివరాలు పంచుకున్నారు. దశాబ్దాల పాటు గురుత్వాకర్షణ ప్రభావం.. మెదడుకి వెళ్లే రక్త ప్రవాహాన్ని నెమ్మదింపజేయవచ్చని, అది వృద్ధాప్యంపై ప్రభావం చూపవచ్చని ఆయన అభిప్రాయం.
ఈ వాదన ఆసక్తిని రేకెత్తించినా సందేహాలు కూడా వచ్చాయి. కేవలం గురుత్వాకర్షణ వృద్ధాప్య ఛాయలను ఎంతవరకు వివరించగలదన్న ప్రశ్నలను కొందరు లేవనెత్తారు.
ఈ “టెంపుల్” భవిష్యత్తులో సాధారణ ప్రజలు కొనుగోలు చేసి ఉపయోగించేందుకు.. మార్కెట్‌లో అమ్మే ఆరోగ్య సంబంధిత డివైజ్‌గా వస్తుందా? లేదంటే ప్రత్యేక పరిశోధనా సాధనంగానే మిగిలిపోతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది.
