Gold Rate: బాబోయ్.. బంగారం ధర లక్ష దాటుతుందా.. గోల్డ్ కొనుగోలుకు ఇదే సరైన సమయమా..?
కొత్త సంవత్సరంలో బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. అయితే, కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..

Gold
Gold and Silver Prices Today: ధనిక, పేద అనే తేడాలేకుండా పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది బంగారం. ముఖ్యంగా ఇంట్లో అమ్మాయిల పెళ్లి అంటే బంగారం కచ్చితంగా కొనుగోలు చేయాల్సిందే. అయితే, ధనవంతులు కాస్త ఎక్కువగా.. మధ్య తరగతి ప్రజలు వారి స్థోమతకు తగ్గట్లుగా బంగారంను కొనుగోలు చేస్తుంటారు. కానీ, గత కొద్దిరోజులుగా ధనిక వర్గాలుసైతం బెంబేలెత్తిపోయేలా బంగారం ధరలు పెరుగుతున్నాయి. గతేడాది చివర్లో వేగంగా పెరుగుతూ వెళ్లిన బంగారం ధర.. కొత్త సంవత్సరంలో తగ్గేదిలేదంటూ మరింత దూసుకెళ్తోంది. దీంతో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 83వేలు దాటేసింది.
బంగారం ధరలు ఆల్ టైం రికార్డులను నమోదు చేస్తున్నాయి. గత పదిరోజులుగా ధరలు భారీగా పెరిగాయి. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కొలువుదీరడం, ట్రంప్ దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలుకూడా బంగారం ధరల పెరుగుదలకు కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వలసదారులకు అవినాభావ సంబంధం ఉంది. దీంతో ఇన్వెస్టర్లు తమ డబ్బును సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించే బంగారంవైపు తరలిస్తున్నారు. మరోవైపు బంగారం ధరల పెరుగుదలకు చైనాకూడా ఓ కారణంగా తెలుస్తోంది. చైనా విపరీతంగా బంగారం నిల్వలను పెంచుకోవడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తుంది. బంగారం ధరల పెరుగుదలలో ఇదే స్పీడ్ కొనసాగితే.. రాబోయే కొద్ది నెలల్లోనే 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. లక్షకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. గతేడాది జూలై నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బంగారంపై దిగుమతి సుంకం కేంద్రం తగ్గించడంతో బంగారం ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. అయితే, ఈసారి బడ్జెట్ లోనూ అదేతరహా నిర్ణయం ఉంటుందా..? లేక సుంకాన్ని పెంచుతారా అనే అంశం ఆసక్తికరంగా మారింది. డాలర్ బలపడుతున్నప్పటికీ గత వారం బంగారం ధరలు పెరిగాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని పెంచితే దేశీయ మార్కెట్ లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు బంగారం ధరలకు కస్టమ్స్ సుంకం పెంపు ఒక్కటే కారణం కాదని, ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని ముట్టుకోకపోయినా, అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆదివారం బంగారం, వెండి ధరల వివరాలు ..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.82,420
♦ 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 75,550.
♦ కిలో వెండి ధర రూ. 1,05,000.
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,700.
♦ 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 82,570.
♦ కిలో వెండి ధర రూ.97,500.
♦ ముంబయి కోల్ కతా, బెంగళూరు నగరాల్లో ..
♦ 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 75,550.
♦ 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.82,420
♦ కిలో వెండి ధర కే, 97,500
♦ చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 75,550.
♦ 24 క్యారట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ. 82,4200.
♦ కిలో వెండి ధర రూ. 1,05,000.