Gold: సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ ఇప్పుడు లేవు కదా? బంగారంపై పెట్టుబడులకు మీ ముందున్న ఎక్కువ డబ్బులొచ్చే ఇతర ఆప్షన్లు ఇవే..

భారతదేశంలో బంగారం కేవలం పెట్టుబడిగా మాత్రమే కాకుండా, ఒక స్టేటస్ కోసం, ముఖ్యంగా మహిళల ఆభరణాల విషయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.

Gold: సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ ఇప్పుడు లేవు కదా? బంగారంపై పెట్టుబడులకు మీ ముందున్న ఎక్కువ డబ్బులొచ్చే ఇతర ఆప్షన్లు ఇవే..

Updated On : February 28, 2025 / 10:08 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ) జారీకి ఇక స్వస్తి చెబున్నట్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ కొత్త ట్రాంచ్‌ల జారీని నిలిపివేయడంతో, పెట్టుబడిదారులు తమ భవిష్యత్ ప్రణాళికల గురించి ఆచితూచి ఆలోచిస్తున్నారు.

ఎస్‌జీబీలు పెట్టుబడిదారులకు గోల్డ్ ఎక్స్‌పోజర్‌తో పాటు స్థిర ఆదాయాన్ని కూడా అందించే ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పించాయి. అయితే, కొత్త ఎస్‌జీబీలు అందుబాటులో లేకపోవడంతో, ఇప్పటికే ఎస్‌జీబీలను కలిగిన వారు వాటిని కొనసాగించాలా లేదా ప్రత్యామ్నాయాలను పరిశీలించాలా? అనే అంశాన్ని వారి పెట్టుబడి లక్ష్యాలు, లిక్విడిటీ అవసరాలు, రిస్క్ ప్రాధాన్యతల ఆధారంగా నిర్ణయించుకోవచ్చు.

ప్రస్తుతం ఎస్‌జీబీ పెట్టుబడిదారులు ఏం చేయాలంటే?
కాలపరిమితి ముగిసే వరకు ఎస్‌జీబీలను కొనసాగిస్తే, సంవత్సరానికి 2.5% స్థిర వడ్డీ ఆదాయాన్ని పొందే అవకాశముంది. అలాగే ఈ బాండ్లు మార్కెట్‌లో ట్రేడ్ అవుతాయి. పెట్టుబడిదారులు అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ఫిజికల్‌గా బంగారం కొనుగోలు చేయడం కంటే ఇదే కొనసాగిస్తే బెటర్. దీంతో ఆర్థిక అవసరాలు తలెత్తినా, లేదా ఇతర పెట్టుబడి అవకాశాలు లభించినప్పుడు మార్కెట్‌లో దాన్ని విక్రయించడం వంటి ఒక ఆప్షన్ ఉంటుందని ట్రేడ్జినీ వెబ్ సైట్ సీఓఓ త్రివేశ్ డి చెప్పారు.

ఇప్పుడు కొత్త ఎస్‌జీబీలు లేకపోవడం వల్ల, పెట్టుబడిదారులు గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ కాయిన్స్ లేదా ఫిజికల్ బంగారంపై దృష్టి పెట్టవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్‌లో వెంటనే లావాదేవీలు చేయడానికి వీలు కల్పిస్తాయి. అలాగే ఫిజికల్ బంగారం కొనుగోలు చేయడం కూడా మంచిదే అయినప్పటికీ.. భద్రతా సమస్యలు, మెయింటెనెన్స్ ఖర్చులు, మేకింగ్ చార్జీలు ఉండవచ్చని ట్రేడ్జినీ వెబ్ సైట్ సీఓఓ త్రివేశ్ డి చెప్పారు.

ఫిజికల్ బంగారం vs డిజిటల్ బంగారం – ఏది ఉత్తమం?
కొత్త సావరిన్ గోల్డ్ బాండ్ ట్రాంచ్‌లు అందుబాటులో లేకపోవడంతో, పెట్టుబడిదారులకు ఫిజికల్ బంగారం లేదా డిజిటల్ గోల్డ్ వైపు వెళ్లాలా అనే ప్రశ్న ఎదురవుతుంది. డిజిటల్ గోల్డ్ లేదా ఫిజికల్ బంగారం మధ్య ఉన్న ఆప్షన్ పూర్తిగా వ్యక్తిగత అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది.

భారతదేశంలో బంగారం కేవలం పెట్టుబడిగా మాత్రమే కాకుండా, ఒక స్టేటస్ కోసం, ముఖ్యంగా మహిళల ఆభరణాల విషయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. వివాహాలు, పండుగల సమయంలో ఫిజికల్ బంగారం కొనుగోలు చేయడం ఒక సంప్రదాయం.

కొంతమంది భద్రత, నిల్వ సౌలభ్యం దృష్ట్యా డిజిటల్ గోల్డ్ వైపు మొగ్గుచూపుతుంటే, మరికొందరు సాంప్రదాయ విలువల కారణంగా ఫిజికల్ బంగారాన్ని ప్రాధాన్యంగా చూస్తున్నారు. మీరు లాంగ్ టర్మ్ పెట్టుబడి కోసం చూస్తున్నట్లయితే డిజిటల్ గోల్డ్ ఉత్తమ ఆప్షన్. కానీ, వ్యక్తిగత ఉపయోగం కోసం, ముఖ్యంగా ఆభరణాలుగా ధరించేందుకు కావాలనుకుంటే ఫిజికల్ బంగారం సరైన ఆప్షన్ అవుతుంది.

కొత్త సావరిన్ గోల్డ్ బాండ్లు ఇకపై లభించకపోయినా గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్, గోల్డ్ కాయిన్స్ లేదా ఫిజికల్ బంగారంవంటి వివిధ ప్రత్యామ్నాయాలు ఇప్పటికీ పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడిదారులు తమ ఆర్థిక అవసరాలు, పెట్టుబడి లక్ష్యాలు, మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అందుబాటులో ఉన్న ఆప్షన్ల నుంచి సరైనదాన్ని ఎంచుకోవడం ఉత్తమం.