Mark Zuckerberg : ఇన్‌స్టాలో ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేసిన జుకర్‌బర్గ్.. పిల్లల ముఖాలను ఎందుకు దాచాడో తెలిస్తే మీరూ అదే చేస్తారు..!
Mark Zuckerberg : మెటా సీఈఓ జుకర్‌బర్గ్ తన ఫ్యామిలీ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు. కానీ, తన పిల్లల ఫొటోలను మాత్రం కనిపించకుండా కవర్ చేశాడు. ఈ విషయంలో భారతీయ పోలీసులు సైతం హెచ్చరిక జారీ చేశారు.

Zuckerberg hides faces of his kids when he shares family pics on Insta, now Indian cops are issuing warning
Mark Zuckerberg : ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో మిలియన్ల మంది యూజర్లు వినియోగిస్తున్నారు. నిత్యం తమ అకౌంట్లలో ఏదో ఒక పోస్టు పెడుతూనే ఉంటారు. తమ ప్రొఫెషనల్ లైఫ్ విషయాల నుంచి పర్సనల్ లైఫ్ విషయాల వరకు ఏదో ఒక అంశంపై పోస్టులు పెడుతూనే ఉంటారు. అయితే, ఇందులో ఎక్కువగా లైకులు, వ్యూస్, కామెంట్ల కోసం ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. చాలామంది పేరంట్స్ అవగాహన లేకుండా తమ పిల్లల ఫొటోలను షేర్ చేస్తుంటారు. ఇది ఎంతవరకు సేఫ్ అనేది మర్చిపోతున్నారు. పిల్లల ప్రైవసీకి సంబంధించి అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో సోషల్ ప్లాట్ ఫారం ప్రవేశపెట్టిన దిగ్గజాలు సైతం తమ పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచుతున్నారు.
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఒకరు.. ఇటీవలే ఆయన తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అయితే, ఆ ఫొటోలో అతడి కుమార్తెలైన మాక్సిమా (Maxima), ఆగస్ట్ (August)ల ముఖాలను హ్యాపీ ఫేస్ ఎమోజితో పిల్లల ముఖాలను కవర్ చేశాడు. జుకర్‌బర్గ్ మాత్రమే కాదు.. జిగి హడిద్ (Gigi Hadid), అడెలె (Adele), విరాట్ కోహ్లీ (Virat Kohli), సోనమ్ కపూర్, అలియా భట్ వంటి భారతీయ ప్రముఖులతో సహా చాలా మంది ప్రముఖులు కూడా ఆన్లైన్లో పోస్ట్ చేసేటప్పుడు తమ పిల్లల ముఖాలను వ్యూహాత్మకంగా దాచిపెట్టారు. మొదట్లో, సెలబ్రిటీలు తమ పిల్లల ముఖాలను చూపించకూడదనే నిర్ణయం కేవలం ప్రైవసీపరమైన ఆందోళనగా అనిపించినప్పటికీ, అసోం పోలీసుల ఇటీవలి సోషల్ క్యాంపెయిన్‌లో పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందిగా తల్లిదండ్రులను హెచ్చరించారు.
సోషల్ మీడియాలో పిల్లల ముఖాలను కనిపించకుండా చేయడం అనేది పిల్లల సమ్మతిని గౌరవించడమేనని ప్రచారంలో అవగాహన కల్పించారు. పిల్లల ప్రైవసీకి సంబంధించి అసోం పోలీసులు కొత్త సోషల్ మీడియా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తల్లిదండ్రులను తమ పిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో ఎక్కువ పోస్ట్‌లను షేర్ చేయరాదని హెచ్చరిస్తున్నారు. మీ పిల్లల ప్రైవసీకి ముప్పు కలిగేలా ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయరాదంటూ #DontBeASharent అనే హ్యాష్ ట్యాగ్‌తో క్యాంపెయిన్ నిర్వహించారు.
గతంలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలను క్రియేట్ చేసిన జుకర్‌బర్గ్, బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్‌తో సహా టెక్ సీఈఓలు కూడా తమ పిల్లల ఫొటోలను ఆన్లైన్లో షేర్ చేయడం మానుకోవాలని సోషల్ మీడియా యూజర్లను హెచ్చరించారు. ఈ విషయంలో ఆపిల్ సీఈఓ (Apple CEO) టిమ్ కుక్ కూడా స్పందిస్తూ.. పిల్లల ఫొటోలను సోషల్ ప్లాట్‌ఫారాల్లో షేర్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాను’ అని పేర్కొన్నారు. సోషల్ మీడియా అనేది వ్యక్తులు వారి మధుర క్షణాలు, ఫొటోలు సహా మరిన్నింటిని స్నేహితులు, ఫాలోవర్లతో షేర్ చేసుకునే ఆన్లైన్ వేదిక.. అయితే, ఈ ప్లాట్‌ఫారమ్‌లో పిల్లల ఫొటోలను పోస్టు చేయడం ఎప్పుడూ సురక్షితం కాదు అనేది గమనించాలి.
పిల్లల సమ్మతి ముఖ్యం :
మొట్టమొదటగా పిల్లలకు సోషల్ మీడియా అంటే ఏమిటో తెలియదు. ఎవరికీ తెలియకుండా వారి అనుమతి లేకుండా వారి ఫొటోలను సోషల్ నెట్‌వర్క్‌లో పోస్ట్ చేయడం వారి ఇష్టానికి విరుద్ధమే. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ కూడా తమ కుమార్తె వామిక పెద్దయ్యాక, ఆన్లైన్లో విషయాలను షేర్ చేయాలని అనుకుంటున్నారా? అని నిర్ణయించుకునే వరకు ఆమె ఫొటోలు తీయవద్దని మీడియాను కోరారు. ఒకసారి పిల్లల ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. అది తల్లిదండ్రుల నియంత్రణలో ఉండదు. ఆ ఫొటోను ఇతరులు షేర్ చేయవచ్చు. లేదంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఫొటోలను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది.

Zuckerberg hides faces of his kids when he shares family pics on Insta, now Indian cops are issuing warning
ఫొటోల షేరింగ్.. పిల్లల ఐడెంటిటీని దొంగిలించడమే.. :
ఆన్లైన్ అనేది అనేక మోసాలకు అడ్డాగా మారింది. ఒకసారి ఏదైనా ఆన్లైన్లో షేర్ అయితే.. డిలీట్ చేయడం దాదాపు అసాధ్యమే.. చాలా మంది ఐడెంటిటీని దొంగలించడం వంటి మోసాలను ఎదుర్కొంటున్నప్పటికీ, సైబర్ నేరస్థులు ఫేక్ ఐడీలను క్రియేట్ చేయడానికి పిల్లల ఫొటోలను ఉపయోగించవచ్చు. క్రెడిట్ కార్డ్‌లను ఓపెన్ చేయడం లేదా పిల్లల పేరు మీద లోన్లు తీసుకోవడం వంటి మోసాలకు పాల్పడే ప్రమాదం లేకపోలేదు.
ఆన్లైన్ ప్రెడేటర్లు :
పిల్లల ఫొటోల అపహరణ, లైంగిక వేధింపులు లేదా ఇతర నేరాలకు పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంది. ది న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. చాలా మంది తల్లిదండ్రులు వైరల్ అవుతున్న తమ పిల్లల ఫోటోలు లేదా వీడియోలను చూసిన భయంకరమైన సంఘటనలను వెల్లడించారు. ప్రత్యేకించి ఈత కొలనులలో ఆడుకునే పిల్లల వీడియోలను పోస్ట్ చేసినందున.. పిల్లల ఫొటోలు మోసగాళ్ల చేతుల్లోకి చేరాయని వాపోయారు. తద్వారా పెడోఫిలీస్, అపహరణ, లైంగిక వేధింపులు, ఇతర నేరాల ప్రమాదాలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఆ ఫొటోలు, వీడియోల ద్వారా తమను టార్గెట్ చేసినట్లు పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
పిల్లలే టార్గెట్.. సైబర్ బెదిరింపులు :
పిల్లల ఫొటోలను పోస్ట్ చేయడం వల్ల వారి మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాదు.. సైబర్ బెదిరింపులకు కూడా గురయ్యే ప్రమాదం ఉంది. మీ పిల్లలను టార్గెట్ చేసుకుని మోసగాళ్లు బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఏఐ, డేటా మైనింగ్ :
ఏఐ ముఖాలను ఎప్పటికీ మర్చిపోదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో నిరంతరం అన్ని ముఖాలను స్కాన్ చేస్తుంది. అందువల్ల, మీరు మీ పిల్లల ఫొటోలను ఫేస్బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేస్తే.. వారి ముఖాలు ప్లాట్‌ఫారమ్‌కు అందుబాటులోకి వస్తాయి. మీ పిల్లల గురించిన డేటాను సేకరించేందుకు కస్టమైజ్ చేసిన యాడ్స్‌తో పిల్లలను లక్ష్యంగా చేసుకోవడానికి లేదా వారి డేటాను ఇతర కంపెనీలకు విక్రయించడానికి ఉపయోగిస్తారు జాగ్రత్త.. అందుకే.. అసోం పోలీసులు ప్రస్తుతం పిల్లల ప్రైవసీపై ఆన్లైన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు ఎవరూ తమ పిల్లల ఫొటోలు, డేటా వంటి వివరాలను అధికంగా సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు.
Read Also : Google Employees : రాబోయే రోజుల్లో గూగుల్ ఉద్యోగులకు ఇంటర్నెట్ పనిచేయదు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..!