ప్రియుడు పెళ్లి చేసుకోలేదని న్యూస్ చానల్ ఉద్యోగిని ఆత్మహత్య

ప్రేమ విఫలమై, మానసిక ఆందళనకు గురై ఓ న్యూస్ ఛానెల్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. సిద్ధిపేట ప్రాంతానికి చెందిన పయ్యావుల రాములు కూతురు కళ్యాణి(26) నగరంలోని ఒక న్యూస్ ఛానెల్‌లో పని చేస్తోంది. ఆమె తన సోదరుడితో కలిసి బోలక్ పూర్‌లో నివాసం ఉంటోంది.
కళ్యాణి అదే సంస్ధలో పనిచేసే శివ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. రెండేళ్ళుగా వీరి ప్రేమ కొనసాగుతుండగా.. ఇటీవల కళ్యాణి ఆ యువకుడిని పెళ్లి చేసుకోమని కోరింది. అందుకు శివ నిరాకరించటంతో తీవ్ర మనో వేదనకు గురైంది. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కళ్యాణి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
బార్బర్ షాపులో పనిచేస్తున్న సోదరుడు ఉదయం విధులకు వెళ్లాడు. రాత్రి వచ్చి చూసే సరికి ఇంట్లో కళ్యాణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంది. వెంటనే గాంధీనగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తన కుమార్తె మరణానికి శివ కారణమంటూ తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గాంధీ నగర్ పోలీసు స్టేషన్ ఎస్‌ఐ మల్లేశ్ వెల్లడించారు.