వివాహేతర సంబంధం…మహిళతో సహా ప్రియుడి హత్య

తాళి కట్టిన భర్త ఉండగా మరోకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో ఒక మహిళను, ఆమె ప్రియుడిని దారుణంగా హత్య చేశారు దుండగులు. తమిళనాడులోని మదురై జిల్లా మేలూరు పట్టణంలో ఆదివారం, మే17వ తేదీ ఉదయం ఈ ఘోరం జరిగింది. నైకర్ పట్టిరోడ్డులోని ఆండిపట్టి వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతున్న వీరిని అటకాయించిన దుండగులు వారిని విచక్షణారహితంగా నరికి చంపారు.మరణించిన వారిని వి.అయ్యమ్మాళ్(26) ఏ.అన్బునాధన్ గా(32) గుర్తించారు. వీరిద్దరూ ధర్కుతేరి నివాసితులు.
అయ్యమ్మాళ్ కు 8 సంవత్సరాల క్రితం విమల్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలానికి ఆమె అవివాహితుడైన అన్బునాధన్ తో ప్రేమలో పడింది. ఈవిషయం అయ్యమ్మాళ్ కుటుంబ సభ్యులకు తెలిసి… వివాహేతర సంబంధం మానుకోమని అన్బునాధన్ ను హెచ్చరించారు. ఈవిషయం అయ్యమ్మాళ్ కు తెలిసింది. దీంతో వీళ్లిద్దరూ ఉన్న ఊరు వదిలేసి వేరే చోట సహజీవనం సాగించారు. ఇటీవలే తిరిగి ధర్కుతేరి వచ్చి కాపురం పెట్టారు.
ఆదివారం ఉదయం వీరిద్దరూ ఆండిపట్టి వద్ద ద్విచక్ర వాహానంపై వెళుతుండగా గుర్తుతెలియని దుండగులు వీరిని హత్య చేశారు. ఘటనా స్ధలానికిచేరుకున్న మెలూరు పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. అన్బునాధన్ గొంతును దుండగులు దారుణంగా కోసినట్లు పోలీసులు గుర్తించారు. అయ్యమ్మాళ్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతోనే ఈ హత్యలు జరిగాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.