స్నేహితుడిని కాపాడి : ఎస్కలేటర్ పైనుంచి జారిపడి వృద్ధుడు మృతి

  • Published By: chvmurthy ,Published On : August 30, 2019 / 11:36 AM IST
స్నేహితుడిని కాపాడి : ఎస్కలేటర్ పైనుంచి జారిపడి వృద్ధుడు మృతి

Updated On : August 30, 2019 / 11:36 AM IST

చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో విషాదం జరిగింది. ఎస్కలేటర్ పైనుంచి జారిపడి ఓ 74 ఏళ్ల వృధ్దుడు మృతిచెందాడు. అతనితోపాటు వచ్చిన మరో వృధ్దుడికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన గిండిలో ఫైవ్ స్టార్ హోటల్ హిల్టన్‌లో జరిగింది.  వివరాల్లోకి వెళితే.. ఎగ్మోర్‌లోని పాంథియోన్ రోడ్‌లో నివసించే రమేష్ జగ్టియాని (74) ఎలక్ట్రానిక్స్ వ్యాపారం చేస్తూ ఉంటారు.

పోయెస్ గార్డెన్‌లో నివసించే ఆయన స్నేహితుడు మృతుంజయ్ సింగ్ (74) తో కలిసి ఒక స్వచ్చంద సంస్ధ నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడానికి హోటల్‌‍‌కు వెళ్లారు. కార్యక్రమం అనంతరం ఇద్దరు ఎస్కలేటర్ పైకి ఎక్కారు. కిందికి దిగుతుండగా మృతుంజయ్ అదుపు తప్పి కిందపడిపోయాడు. అతన్ని పట్టుకోడానికి వెనుక ఉన్న రమేష్ ప్రయత్నించాడు. కదులుతున్న ఎస్కలేటర్ పై సరైన ఆధారం దొరక్క స్నేహితులు ఇద్దరూ అదుపు తప్పి పడిపోయారు.

అది గమనించిన హోటల్ సిబ్బంది వెంటనే ఎస్కలేటర్‌ను ఆపారు. గాయపడ్డ ఇద్దరిని వెంటేనే ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయం కారణంగా రమేష్ జగ్టియాని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించాడు. తీవ్రగాయాలైన మృతుంజయ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న గిండీ పోలీసులు విచారణ చేపట్టారు.

Also Read : రేపే ఆఖరు రోజు : ఐటీ రిటర్న్ గడువు పెంచలేదు

గతంలోనూ చెన్నైలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. 2018లో ఎక్స్‌ప్రెస్ అవెన్యూ మాల్‌లో నవీన్ అనే 10 ఏళ్ల బాలుడు ఎస్కలేటర్ నుంచి కిందపడ్డాడు. నవీన్ తలకు గాయాలవటంతో నాలుగు రోజులు పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.