Case On Bar : ఫుల్లుగా తాగి…బార్‌పై కేసు వేసి రూ.40 కోట్లు రాబట్టిన సుడిగాడు

టెక్సాస్ కు చెందిన తాగుబోతు బార్ వద్ద జరిగిన గొడవకు...తనకు మందు పోసిన బార్ పైనే కేసుపెట్టి ఇండియన్ కరెన్సీలో రూ. 40 కోట్లు భారీ నష్టపరిహారం పొందాడు.

Case On Bar : ఫుల్లుగా తాగి…బార్‌పై కేసు వేసి రూ.40 కోట్లు రాబట్టిన సుడిగాడు

Mexican Grill and Bar

Updated On : August 17, 2021 / 3:02 PM IST

Case On Bar : మీరు మద్యపాన ప్రియులనుకోండి బార్‌కు వెళ్ళి ఫుల్లుగా తాగారు. అక్కడ మీకు, ఇంకొకరికి గొడవ అయ్యిందనుకోండి. వెంటనే పోలీసులు వచ్చి ఇద్దరిపై కేసు నమోదు చేస్తారు. అవేం లేకుండా ఉండాలంటే వాళ్ల చేతులు తడిపి మీరు అక్కడినుంచి జారుకోవాలి. కానీ టెక్సాస్ కు చెందిన పచ్చి తాగుబోతు బార్ వద్ద జరిగిన గొడవకు…తనకు మందు పోసిన బార్ పైనే కేసుపెట్టి ఇండియన్ కరెన్సీలో రూ. 40 కోట్లు భారీ నష్టపరిహారం పొందాడు.

టెక్సాస్‌కు చెందిన డానియల్ రాల్స్ అనే వ్యక్తి 2019 మే నెలలో ఒకరోజు ఆండ్రూస్‌లోని లా ఫగోటా మెక్సికన్‌ గ్రిల్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కి వెళ్లాడు. అక్కడ పీకలదాకా ఫుల్‌గా తాగాడు. ఇంటికి వెళ్లటం కోసం కార్ పార్కింగ్‌ దగ్గరకు వచ్చాడు. అక్కడ ఓ వ్యక్తితో గొడవవ పడ్డాడు. ఈ గొడవలో రాల్స్‌ తలకు దెబ్బ తగిలింది. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక తాను మద్యం సేవించిన బార్‌ మీద కోర్టులో కేసు వేశాడు డానియల్‌ రాల్స్‌. ఆ రెస్టారెంట్‌ వల్లే తాను అతిగా మద్యం సేవించానని, వాళ్ల నిర్లక్ష్యం వల్లే తన ప్రాణాల మీదకు వచ్చిందని ఆరోపించాడు.

గొడవ ఆ బార్‌ పరిసరాల్లోనే జరిగిందని, వాళ్లు నిర్లక్ష్యంతోనే తనకు ఫుల్‌గా తాగించారని, ఇలాంటి నేరాలు జరిగే అవకాశం ఉందని తెలిసీ.. మరీ తనకు మందు టూమచ్‌గా సర్వ్‌ చేశారని ఆరోపించాడు. పైగా గొడవ జరుగుతున్న సమయంలోనూ బార్‌ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన లేదని, తన తలకు దెబ్బ తగిలితే కనీసం ఆంబులెన్స్‌ను కూడా పిలిచి చికిత్స అందివ్వలేలేదని.. అంటూ బార్ యాజమాన్యంపై పలు ఆరోపణలు చేశాడు.

ఈ కేసులో బార్‌ ఓనర్‌తో పాటు తనకు సర్వ్‌ చేసిన బార్‌టెండర్‌ను నిందితులుగా చేర్చాడు. కేసు న్యాయస్ధానంలో విచారణకు వచ్చింది. బార్ యజమాని తరుఫు లాయర్ డానియల్ రాల్స్ పచ్చి తాగుబోతు అని నిరూపించటానికి ప్రయత్నించాడు. 2019 ఫిబ్రవరిలో పబ్లిక్‌గా తాగి..న్యూసెన్స్‌ క్రియేట్‌ చేసి జైలుకు వెళ్లాడు అంటూ…. ఈ ఏడాది మేలోనూ ఓ వ్యక్తితో గొడవ పడి అరెస్ట్‌ అయ్యాడు అని కోర్టుకు సాక్ష్యాలు సమర్పించాడు.

కానీ కోర్టు ఇవేమీ పట్టించుకోలేదు. రాల్స్ కు మద్దతుగా తీర్పు చెప్పింది. బార్ యజమాని రాల్స్ కు 5 మిలియన్ డాలర్లు నష్ట పరిహారం చెల్లించాలని… కోర్టు నోటీసులకు సరిగా స్పందించనందున మరో అర మిలియన్ డాలర్లను కలిపి రాల్స్ కు చెల్లించాలని ఆండ్రూస్ కౌంటీ 109 వ నాయస్ధానం ఆదేశించింది.