Telangana Student Shot Dead : అమెరికాలో ఘోరం.. దుండగుల కాల్పుల్లో తెలుగు విద్యార్థి మృతి.. ఎవరీ ప్రవీణ్, అసలేం జరిగింది..
ప్రవీణ్ మృతితో అతడి ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Telangana Student Shot Dead : అమెరికాలో దారుణం జరిగింది. మరో తెలుగు విద్యార్థి తూటాలకు బలయ్యాడు. దుండగులు జరిగిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన ప్రవీణ్ కుమార్ గంపా చనిపోయాడు. అతడి వయసు 27 ఏళ్లు. విస్కాన్ సిన్ లో ఈ ఘటన జరిగింది. ప్రవీణ్ దేహంపై బుల్లెట్ గాయాలు ఉన్నాయని అతడి స్నేహితులు తెలిపారు.
ప్రవీణ్ కుమార్ విస్కాన్ సిన్ యూనివర్సిటీలో ఎంఎస్ సెకండియర్ చదువుతున్నాడు. తాను నివాసం ఉండే ప్రాంతంలోని ఒక స్టోర్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు ప్రవీణ్. కాగా, స్టోర్ లో దుండగులు దోపిడీకి యత్నించారు. ఆ సమయంలో ప్రవీణ్ పై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ ఘటనపై స్పందించింది. ప్రవీణ్ కుమార్ మృతి పట్ల సంతాపం తెలిపింది. విస్కాన్ సిన్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్న విద్యార్థి ప్రవీణ్ కుమార్ గంపా మరణం బాధాకరం అంది. తాము ప్రవీణ్ కుటుంబంతో టచ్ లో ఉన్నామని, వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కాన్సులేట్ జనరల్ వెల్లడించింది.
ప్రవీణ్ మృతి గురించి అమెరికా అధికారులు బుధవారం ఉదయం అతడి కుటుంబసభ్యులకు తెలియజేశారు. ప్రవీణ్ మృతదేహం కనుగొన్నామన్నారు. అతడి దేహంపై బుల్లెట్ గాయాలు ఉన్నాయన్నారు.
Also Read : ఎంతకు తెగించారు.. విదేశీయులే టార్గెట్.. హైదరాబాద్ లో దిమ్మతిరిగిపోయే కాల్ సెంటర్ స్కామ్..
మిల్వాకీలో ప్రవీణ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతడు పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న స్టోర్ లో దోపిడీకి యత్నించిన దుండగులు కాల్పులు జరపడంతో ప్రవీణ్ చనిపోయాడు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలానికి చెందిన ప్రవీణ్.. విస్కాన్ సిన్ యూనివర్సిటీలో ఎంఎస్ డేటా సైన్స్ సెకండియర్ చదువుతున్నాడు. హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసిన ప్రవీణ్.. 2023 ఆగస్ట్ లో అమెరికా వెళ్ళాడు. 2024 డిసెంబర్‌లో ఇంటికి వచ్చాడు. 2025 జనవరి 20వ తేదీన తిరిగి అమెరికా వెళ్లిపోయాడు.
ప్రవీణ్ మృతితో అతడి ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు, ఎంతో భవిష్యత్తు ఉన్న కుర్రాడు ఇలా అర్థాంతరంగా దూరమైపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. 4 నెలల్లో ప్రవీణ్ తన కోర్సును పూర్తి చేయబోతున్నాడని అతడి తండ్రి రాఘవులు తెలిపారు. త్వరలోనే మంచి ఉద్యోగంలో చేరి స్థిరపడే ప్రయత్నాల్లో ఉన్నాడని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని బోరున విలపించారు.
”బుధవారం తెల్లవారుజామున వాట్సాప్ కాల్ వచ్చింది. అయితే ఆ సమయంలో నిద్రపోతున్నాం. దాంతో కాల్ లిఫ్ట్ చేయలేకపోయాం. ఉదయం లేచి ఫోన్ చూడగా.. అందులో మిస్డ్ కాల్ ఉంది. తిరిగి కాల్ చేయమని వాయిస్ మేసేజ్ ఉంది. ఆ నెంబర్ కు కాల్ చేశాం. కానీ అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. గంట తర్వాత నేను నా కొడుకు ప్రవీణ్ కు కాల్ చేశా. ప్రవీణ్ కాకుండా మరెవరో ఫోన్ లిఫ్ట్ చేశారు. ప్రవీణ్ ఫోన్ తమకు దొరికిందని చెప్పారు. ప్రీణ్ పుట్టిన తేదీని వారు అడిగారు.
మొదట అది సైబర్ నేరగాళ్ల కాల్ అనుకున్నాము. ఆ తర్వాత ప్రవీణ్ ఫ్రెండ్స్ కి కూడా కాల్స్ వచ్చాయి. ఘటనా స్థలానికి రావాలని చెప్పారు. ప్రవీణ్ పని చేసే స్టోర్ లో దొంగలు పడ్డారని, వారు జరిపిన కాల్పుల్లో నా కొడుకు చనిపోయాడని పోలీసులు తెలిపారు. తొలుత ప్రైవేట్ గన్ అన్నారు, తర్వాత స్టోర్ లోని గన్ అని చెప్పారు. మొదట బీచ్ దగ్గర ఘటన జరిగిందన్నారు. ఆ తర్వాత స్టోర్ లోనే జరిగిందని చెప్పారు” అని ప్రవీణ్ తండ్రి రాఘవులు చెప్పారు. ప్రవీణ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు అధికారులు సాయం చేయాలని రాఘవులు కోరారు.
అమెరికాలో దుండగుల కాల్పుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చనిపోతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవలి కాలంలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఇలానే దుండుగుల కాల్పులకు బలయ్యారు. గతేడాది నవంబర్ లో ఖమ్మంకి చెందిన విద్యార్థి అమెరికాలో మృత్యువాతపడ్డాడు. 2025 జనవరిలో హైదరాబాద్ కు చెందిన మరొక స్టూడెంట్ ఇలాడే తూటాలకు బలయ్యాడు. ఎన్నో ఆశలతో, ఆశయాలతో, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న తెలుగు విద్యార్థులు ఇలా తూటాలకు బలైపోతుండటం ఆవేదనకు గురి చేస్తోంది. విదేశాల్లో చదువుకుంటున్న పిల్లల భద్రత పై వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.