నెల్లూరు జిల్లా టీఎన్ఎస్‌ఎఫ్‌ అధ్యక్షులు తిరుమలనాయుడుపై రాళ్ల దాడి

  • Published By: veegamteam ,Published On : April 14, 2019 / 11:52 AM IST
నెల్లూరు జిల్లా టీఎన్ఎస్‌ఎఫ్‌ అధ్యక్షులు తిరుమలనాయుడుపై రాళ్ల దాడి

Updated On : April 14, 2019 / 11:52 AM IST

నెల్లూరు జిల్లా టీఎన్ఎస్‌ఎఫ్‌ అధ్యక్షులు తిరుమలనాయుడిపై దాడి జరిగింది. తిరుమలనాయుడిని గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి పరారయ్యారు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరోవైపు దాడికి పాల్పడింది వైసీపీకి చెందిన కార్యకర్తలుగా టీడీపీ నాయకులు అనుమానిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరుమలనాయుడు క్రీయాశీలక పాత్ర పోషించారు.

నెల్లూరులోని బైపాస్ రోడ్డులో నెల్లూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి వీరమస్తాన్ ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్ దగ్గరే తిరుమలనాయుడు నిలబడి ఉన్నారు. అకస్మాత్తుగా అక్కడికి కారులో కొందరు యువకులు వచ్చారు. వెంటనే కారు దిగి రాళ్లు, కర్రలు, రాడ్లతో అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో తిరుమలనాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావం అయింది. ఆఫీస్ లో ఉన్న నాయకులు బయటికి వచ్చి అతన్ని సింహపురి ఆస్పత్రికి తరలించారు. తిరుమలనాయుడికి ప్రాణపాయం లేదు. అతనికి చికిత్స అందిస్తున్నారు.

అయితే దాడి వెనుక వైసీపీ కార్యకర్తల హస్తం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయాన్ని ఎమ్మెల్సీ బీర రవిచంద్ర చెప్పారు. కొద్దిసేపటి క్రితం తిరుమలనాయుడు తన దగ్గరికి వచ్చి ఆయన్ను కొడతామని,  చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పినట్లు బీర రవిచంద్ర తెలిపారు. ఈనేపథ్యంలో దాడి వెనుకాల వైసీపీ నాయకుల పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

ఇదిలావుంటే ఎన్నికల మందు టీడీపీ ఆఫీస్ ముందు వైసీపీకి చెందిన ఆటో వెనుకాల ‘నిన్ను నమ్మం బాబు’ స్టిక్కర్ తో నిలబడి ఉన్నది. అక్కడ నిలబడిన సమయంలో తిరుమలనాయుడు ఆ ఆటోకు సంబంధించిన వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. అతనిపై దాడి చేశాడు. వెంటనే ఆటోకు ఉన్న స్టిక్కర్ కూడా తొలగించి, అక్కడి నుంచి పంపించి వేశాడు. ఆ తర్వాత అదే వ్యక్తి ఆటోకు అదే స్టిక్కర్ వేసుకొచ్చి తిరుమలనాయుడికి సవాల్ చేశాడు.

వైసీపీకి చెందిన వ్యక్తులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని నాయుడుకు సంబంధించిన వారుగా గుర్తించారు. వీరే దాడి చేశారని టీడీపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. టీడీపీ నేతలు ఇప్పటికే ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.