తిరుమల కొండ పై బాలుడి కిడ్నాప్ :భద్రత కరువు

  • Published By: chvmurthy ,Published On : March 17, 2019 / 04:44 AM IST
తిరుమల కొండ పై బాలుడి కిడ్నాప్ :భద్రత కరువు

తిరుమల: తిరుమల కొండ పై చిన్న పిల్లల కిడ్నాప్ లు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా కిడ్నాప్ లకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. తాజాగా తిరుమల కొండపై ఓ  మూడు నెలల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన మహవీర్‌, కౌసల్య దంపతులు కొంతకాలంగా తిరుమల కొండపై  చిన్నవ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నిద్రించిన సమయంలో, ఆదివారం తెల్లవారుఝూము నుంచి వీరి మూడు  నెలల బాబు వీరేష్ కనిపించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. బాలుడి ఆచూకి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లోగాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకి లభించలేదు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. 

తిరుమలలో ఆరు నెలల క్రితం కూడా ఇలానే ఓ వ్యక్తి బాలుడిని అపహరించుకుని వెళ్ళాడు. ఎట్టకేలకు అతడిని మహారాష్ట్రలో పోలీసులు పట్టుకున్నారు. కొండపై భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ ఆదివారం ఉదయం ఈ ఘటన జరగడం గమనించదగ్గ విషయం.బాలుడి ఆచూకీ కోసం విజిలెన్స్‌ అధికారులు, పోలీసులు గాలిస్తున్నారు.