Bhopal honey trap case : ఫిర్యాదుదారులు, నిందితులంతా మిస్సింగ్.. కేసులో కొత్త ట్విస్ట్‌

  • Published By: sreehari ,Published On : September 7, 2020 / 09:28 PM IST
Bhopal honey trap case : ఫిర్యాదుదారులు, నిందితులంతా మిస్సింగ్.. కేసులో కొత్త ట్విస్ట్‌

Updated On : September 7, 2020 / 9:54 PM IST

Bhopal honey trap case : హ‌నీ ట్రాప్ కేసులో భోపాల్ క్రైమ్ బ్రాంచ్ ఓ యూట్యూబ్ న్యూస్ ఛానల్ యజమాని, ఎడిటర్‌ను అరెస్టు చేసింది. మెడికల్ కాలేజీ ప్రొఫెసర్‌ను కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై మ‌రో ముగ్గురిని కూడా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా రిపోర్టర్‌పై ఫిర్యాదు చేసిన డాక్టర్ దీపక్ మరవిపై క్రైమ్ బ్రాంచ్ కేసు నమోదు చేసింది. ఆ మ‌హిళా రిపోర్ట‌ర్ ఇప్ప‌డు అదృశ్యమైపోయింది.



మహిళపై ఫిర్యాదు చేయ‌డానికి మొద‌ట‌ క్రైమ్ బ్రాంచ్‌ను సంప్రదించిన దీపక్ మరవి కూడా అదృశ్యమైపోయాడు. డాక్టర్ మరవి, మహిళా రిపోర్టర్ ఇద్దరి కోసం వెతుకుతున్నామని క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. వారిద్దరూ తప్పిపోయారని, ఇప్ప‌డు వేర్వేరు కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపింది. మహిళా రిపోర్టర్, మరో నలుగురు కిడ్నాప్, బ్లాక్ మెయిలింగ్ కేసులో నిందితులుగా ఉన్నారని వెల్లడించింది. డాక్టర్ లైంగిక వేధింపుల కేసులో నిందితుడుగా ఉన్నాడని అదనపు ఎస్పీ గోపాల్ సింగ్ చెప్పారు.



డాక్ట‌ర్ దీపక్ మరవిని వైద్యం కోసం మహిళా రిపోర్టర్ వెళ్లిందని గోపాల్ తెలిపారు. మొదటిసారే వీరిద్ద‌రూ ఫోన్ నెంబ‌ర్ల‌తో చాటింగ్ చేశారని పేర్కొన్నారు. మహిళా రిపోర్టర్ అన్ని మెసేజ్‌లను రికార్డు చేసి ఉంచి.. బనలాల్ సింగ్ రాజ్‌పుత్, అవదేశ్ శర్మ, ఒక మహిళా సహోద్యోగితో కలిసి దీపక్ మరవిని కిడ్నాప్ చేసి అతడి నుంచి రూ .50 లక్షలు డిమాండ్ చేయాలని ప్లాన్ వేసింది. మహిళా రిపోర్టర్ బనలాల్, అవదేశ్ సహా నలుగురు పురుషుల‌తో డాక్టర్ క్లినిక్‌కు ఆగస్టు 29న వెళ్లింది. ఆ తర్వాత వైద్యుడిని ఇంటికి తీసుకెళ్లింది.



అక్కడే అతన్ని కిడ్నాప్ చేసి రూ.50 లక్షలు ఇవ్వాల‌ని డిమాండ్ చేసింది. తనతో చాటింగ్ చేసినవన్నీ బయటపెడతానంటూ ఆమె బెదిరించింది. అందుకు డాక్టర్ 24 గంటల సమయం కోరాడు. ఈ సమయంలో దీప‌క్ మ‌ర‌వి క్రైమ్ బ్రాంచ్‌కు సమాచారం ఇచ్చాడు.. పోలీసులు అరెస్ట్ చేసేందుకు రెడీ అయ్యారు.. ఇంతలోనే మ‌హిళా రిపోర్ట‌ర్‌ డాక్ట‌ర్‌తో మాట్లాడిన ఆడియో రికార్డుల‌ను వారికి అంద‌జేసి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో డాక్టర్‌తో పాటు మ‌హిళా రిపోర్ట‌ర్ కూడా అదృశ్యమైందని పోలీసులు గుర్తించారు.. వీరందరి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.