అయేషా మీరా హత్యకేసులో సీబీఐ దూకుడు 

  • Published By: veegamteam ,Published On : January 18, 2019 / 11:47 AM IST
అయేషా మీరా హత్యకేసులో సీబీఐ దూకుడు 

విజయవాడ : అయేషా మీరా హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. గుడ్లవల్లేరులో మాజీ మంత్రి కోనేరు రంగారావు మనువడు కోనేరు సతీష్‌ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. గతంలో కోనేరు సతీష్‌కు సీఐడీ అధికారులు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. అటు ఉదయం నుండి సత్యంబాబును సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. సత్యంబాబు కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను సీబీఐ అధికారులు రికార్డ్ చేసుకుంటున్నారు. విజయవాడ- నందిగామ సమీపంలోని అనగమసాగరం గ్రామంలో సీబీఐ అధికారులు సత్యంబాబును విచారిస్తున్నారు. 

ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని సత్యం బాబు మరోసారి తెలిపారు. పోలీసులు తనను బెదిరించారని ఆరోపించారు. జైలులో పనిచేసి రూ.35 వేలు సంపాదించి అప్పు తీర్చానని పేర్కొన్నారు. తనకు బతికేందుకు కనీస ఉపాధి కూడా లేదని సీబీఐ అధికారులతో సత్యం బాబు చెప్పారు. 

మరోవైపు మీడియాని లోపలికి అనుమతించేందుకు అధికారులు నిరాకరించారు. ఆయేషా మీరా హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కున్న సత్యంబాబు దాదాపు 8 సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవించి ఆ తరువాత నిర్దోషిగా విడుదలయ్యారు.