Rash Driving : సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, మహిళ మృతి.. హనుమకొండలో దారుణం

ఓటు వేసి వెళ్తున్న క్రమంలో మహిళను అతివేగంగా దూసుకొచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలతో ఆమె మృతి చెందింది.

Rash Driving : సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, మహిళ మృతి.. హనుమకొండలో దారుణం

Rash Driving (Photo : Google)

అతివేగం అత్యంత ప్రమాదకరం, ప్రాణాంతకం అని పోలీసులు నెత్తీ నోరు బాదుకుని చెబుతున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో, ఎంతమంది చనిపోతున్నారో కళ్లారా చూస్తున్నాం. అయినా ఇంకా కొందరు నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. తాజాగా హనుమకొండలో దారుణం జరిగింది. ర్యాష్ డ్రైవింగ్ ఒకరి ప్రాణం తీసుకుంది. ఓ మహిళ మృతికి కారణమైంది.

అతివేగంతో కారు నడిపి ఓ మహిళ ప్రాణాలు బలి తీసుకున్నాడు ఎక్సైజ్ CI కొడుకు. ఫాతిమానగర్ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది. నిన్న ఓటు వేసి వెళ్తున్న క్రమంలో కవిత అనే మహిళను అతివేగంగా దూసుకొచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రగాయాలతో మృతి చెందింది.

కారు నెంబర్ TS03FA9881. ఎక్సైజ్ సీఐ శరత్ కి చెందిన కారుగా గుర్తించారు. అతివేగంతో కారు నడిపి మహిళ ప్రాణాలు బలి తీసుకున్నాడు సీఐ కొడుకు వంశీభార్గవ్. అయితే, పోలీసులు పట్టించుకోకపోవడంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుకి నిరసనగా కాజీపేట పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. ర్యాష్ డ్రైవింగ్ తో కవిత మృతికి కారణమైన సీఐ కొడుకుపై చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని, కవిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.