కన్నీళ్లు ఆగవు : తగలబడుతున్న చెత్తలో పడి చిన్నారి మృతి

బెంగళూరులో దారుణం జరిగింది. చెత్త తగులబెట్టే సమయంలో ప్రమాదవశాత్తూ అందులో జారిపడి మూడేళ్ల చిన్నారి మరణించింది.మార్చి-5,2019న జరిగిన ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది.
బెంగళూరులోని కబ్బన్ పార్క్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న లేకేషప్పకి మూడేళ్ల కూతురు హర్షాలి ఉంది.మార్చి-5,2019న శివాజీనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సాయంత్రం 5గంటల సమయంలో విరిగిపోయిన చెట్టుకొమ్మలు,రాలినఎండు ఆకులు,తదితర వ్యర్థాలతో కూడిన చెత్తను తగులబెట్టేందుకు నిప్పుపెట్టారు.అయితే ఇదే సమయంలో అక్కడ ఆడుకుంటున్న హర్షాలి,మరో బాలుడు అక్కడ బాల్ తో ఆడుకుంటున్నారు.బాల్ ని పట్టుకునే క్రమంలో బాలుడు హర్షాలిని నెట్టాడు.దీంతో చిన్నారి హర్షాలి తగలబడుతున్న చెత్తలో పడిపోయింది.
చిన్నారి నైలాన్ దుస్తులు ధరించడంతో వెంటనే చిన్నారి శరీరానికి మంటలు అంటుకున్నాయి. మంటలు అంటుకోవడంతో చిన్నారి పరుగులు తీసింది.దీన్ని గమనించిన సుభాష్ అనే ఓ వ్యక్తి హర్షాలిని కాపాడేందుకు ప్రయత్నించాడు.మంటలు అంటుకొని పరుగెడుతున్న చిన్నారిపై నీళ్లు పోసి,చిన్నారి దుస్తులను తొలగించాడు.ఈ సమయంలో సుభాష్ చేయ్యి కూడా కాలిపోయింది.వెంటనే చుట్టుపక్కల వాళ్లు, హర్షాలి తల్లి సుధామణి స్పాట్ కి చేరుకున్నారు.చిన్నారిని బౌరింగ్ హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు.ఆ తర్వాత చిన్నారిని విక్టోరియా హాస్పిటల్ కు మార్చారు.అయితే చిన్నారి శరీరం ట్రీట్మెంట్ కు సహకరించలేదు. మార్చి-13,2019న హర్షాలి చనిపోయింది.
ఈ ఘటనకు సంబంధించిన పోస్ట్ సోమవారం(మార్చి-25,2019) పోలీస్ వాట్సాప్ గ్రూప్ లో వైరల్ గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.చిన్నారి హర్షాలి తండ్రి లోకేషప్ప ఘటనకు సంబంధించిన పోస్ట్ ని బాధాతప్త హృదయంతో వాట్సాప్ లో పోస్ట్ చేశారు.తన ఫ్రెండ్స్ కి ఈ మెసేజ్ పంపించానని,తన కూతురికి జరిగనది మరెవరికీ జరగకూడదని,అధికారులు ఈ విషాద ఘటనను పరిగణలోకి తీసుకొని ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని లోకేషప్ప తెలిపారు.