కోటి రూపాయలు డిమాండ్ : నకిలీ విలేకరి ముఠా అరెస్టు 

  • Published By: chvmurthy ,Published On : November 15, 2019 / 09:52 AM IST
కోటి రూపాయలు డిమాండ్ : నకిలీ విలేకరి ముఠా అరెస్టు 

Updated On : November 15, 2019 / 9:52 AM IST

పాతికేళ్లు దాటాయో లేదో  కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకున్నాడో ప్రబుధ్దుడు. ఇందుకోసం ఏకంగా నకిలీ విలేకరి, ఎస్.ఐ. అవతారాలెత్తాడు. ఒక బంగారం కొట్టు యజమాని నుంచి కోటి రూపాయలు కాజేసే ప్రయత్నంలో..తనముఠాతో సహా అడ్డంగా బుక్కయి పోలీసులకు దొరికి పోయాడు. 

వివరాల్లోకి వెళితే చెన్నై, తిరువేర్కాడు, ఏళుమళైనగర్ కు చెందిన ధనశేఖర్(27) అనే వ్యక్తి నవంబర్ 3న బంగారు నగలు కొనటానికి  చెన్నై, ఉస్మాన్ రోడ్డులోని శరవణ గోల్డ్ షాప్ కు వెళ్లాడు. అక్కడ తన వద్ద ఉన్న పాత బంగారు నాణాన్ని ఇచ్చి మూడు సవర్ల బంగారు గొలుసు తీసుకున్నాడు. దానికి ఒక రకమైన పౌడరు పూసి, ఇది నకిలీ బంగారంలా ఉందని సిబ్బందితో గొడవకు దిగాడు. దీంతో షోరూంలో గందరగోళ పరిస్ధితి నెలకొంది. యజమాని శివ అరుల్ దురై వచ్చి ధనశేఖర్ కు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. ధనశేఖర్ యజమాని మాట వినకపోగా ..తాను యూనివర్సల్ ప్రెస్ మీడియా వైస్ ప్రెసిడెంట్ను, మీ షోరూంలో నకిలీ బంగారు నగలు అమ్ముతున్నారని  మీడియాలో ప్రచారం చేస్తానని, ఇంక మీ షాపులో ఎవరూ బంగారం కొనరని బెదిరించాడు.

వినియోగాదరుల ముందు పరువుపోతుందని భావించిన  బంగారం కొట్టు యజమాని అతడితో మాట్లాడి 15 లక్షలరూపాయలు ఇచ్చి పంపించి వేసాడు. ఇదే అదనగా భావించిన ధనశేఖర్ బంగారం షాపు యజమాని నుంచి మరింత డబ్బు గుంజాలని ప్రయత్నంతో..16 మంది స్నేహితులను తీసుకుని 2కార్లలో మళ్లీ అదే షోరూం కివెళ్లాడు. షాపు యజమాని శివ అరుల్ దురై  చాంబర్ లోకి వెళ్లి కోటి రూపాయలు డిమాండ్ చేశాడు.  మంచి బంగారాన్ని నకిలీ అని ఆరోజు వినియోగాదరుల ముందు గొడవచేయటంతో రూ.15లక్షలు ఇచ్చాను. ఇంక ఒక్కపైసా కూడా ఇచ్చేదిలేదని తేల్చి చెప్పాడు షాపు యజమాని. దీంతో ముఠాలోని కొందరు సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. వారిలో జీవా అనేవ్యక్తి లేచి దుకాణం యజమానికి తుపాకి గురిపెట్టి గొడవకు దిగాడు. యజమాని శివ అరుళ్ దురై పరిస్ధితిని సిబ్బందికి సైగ చేయటంతో వారు పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి షోరూం కు వచ్చారు. పోలీసులను చూసిన ముఠా సభ్యులు పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు,షాపు సిబ్బంది వారిని చుట్టుముట్టారు. ఈ క్రమంలో 10 మందిని పట్టుకోగా మరో 6గురు పరారీలో ఉన్నారు. ముఠా నాయకుడు ధన శేఖర్ వద్ద నుంచి అనేక మీడియా సంస్ధలకు చెందిన నకిలీ ఐడీ కార్డులు, నకిలీ ఎస్ఐ గుర్తింపు కార్డును.నకిలీ లాయరు గుర్తింపు కార్డు.. అతని స్నేహితుల నుంచి మారణాయుధాలు, లక్షరూపాయల నగదు, 2 కార్లు స్వాధీం చేసుకున్నారు.

fake journalist gang arrested in chennai