లండన్ నుంచి హైదరాబాద్‌కు శ్రీహర్ష డెడ్ బాడీ : అనుమానాలు వ్యక్తం చేస్తున్న తండ్రి

  • Published By: madhu ,Published On : September 19, 2019 / 07:29 AM IST
లండన్ నుంచి హైదరాబాద్‌కు శ్రీహర్ష డెడ్ బాడీ : అనుమానాలు వ్యక్తం చేస్తున్న తండ్రి

Updated On : September 19, 2019 / 7:29 AM IST

లండన్‌లో మృతి చెందిన ఖమ్మం వాసి శ్రీహర్ష మృతదేహం హైదరాబాద్‌‌కు చేరుకుంది. లండన్‌లో 25 రోజుల క్రితం అదృశ్యమైన ఇతడి డెడ్ బాడీ వారం క్రితం బీచ్‌లో దొరికిన సంగతి తెలిసిందే. అయితే..మృతిపై అతని కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెప్పారు. యూనివర్సిటీపైనా మరికొందరిపైనా సందేహాలు వ్యక్తం చేశారు. 

గత నెల లండన్‌లో మిస్‌ అయిన శ్రీహర్ష.. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సన్నె ఉదయ్‌ ప్రతాప్‌ కుమారుడు. MS చేసేందుకు రెండేళ్ల క్రితం లండన్‌ వెళ్టిన శ్రీహర్ష… అగస్ట్‌ 23న కనిపించకుండా పోయాడు. ఇటీవల ఆయన మృతదేహాన్ని కనిపెట్టినట్టు సమాచారం అందించిన లండన్‌ పోలీసులు డీఎన్‌ఏ టెస్ట్‌ చేసి మృతదేహాన్ని ఇండియాకు పంపించారు. శ్రీహర్ష చదువులో చాలా చురుకు. చిన్నతనం నుంచే మంచి ప్రతిభ కనబరిచేవాడు. లండన్‌లో ఎంఎస్‌ చేసేందుకు వెళ్లిన ఇతను.. అక్కడ కూడా తన ప్రతిభను కొనసాగించాడు.

ఈ క్రమంలోనే అగస్ట్‌లో శ్రీహర్ష అదృశ్యమయ్యాడంటూ కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. వెంటనే లండన్‌కు వెళ్లిన శ్రీహర్ష తండ్రి.. అక్కడి పోలీసులను కలిశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసినా దర్యాప్తు మాత్రం సరిగా చేయలేదని ఆరోపించారు. శ్రీహర్ష ఫోన్‌ను లండన్‌ బీచ్‌ సమీపంలో గుర్తించిన పోలీసులు.. తర్వాత మృతదేహాన్ని గుర్తించనట్టు సమాచారం అందించారు. 

డీఎస్‌ఏ టెస్ట్‌ జరిగిన విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు శ్రీహర్ష తండ్రి. తల్లిదండ్రులు అందుబాటులో ఉన్నా.. వారి రక్త నమూనాలతో సరిపోల్చకుండా వేరే పద్దతుల్లో టెస్టులు చేయడం పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటు యూనివర్సిటీలోని కొందరిపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలు వెలుగులోకి తేవాలని తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. 
Read More : స్ట్రెస్ రిలీఫ్ కోసం : పోలీసులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్