టీటీడీ పరిపాలన భవనంలో అగ్నిప్రమాదం.. ఎలా జరిగిందంటే..
విషయం గురించి తెలుసుకున్న టీటీడీ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

TTD Building Fire Incident : తిరుపతిలోని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ప్రధాన పరిపాలన భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇంజినీరింగ్ విభాగానికి చెందిన కొన్ని ఫైల్స్ దగ్దమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. విషయం గురించి తెలుసుకున్న టీటీడీ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అగ్నిప్రమాదంలో కొన్ని ఫైళ్లు పాక్షికంగా దగ్ధమైనప్పటికీ పెద్దగా నష్టం వాటిల్లలేదని టీటీడీ ఉన్నతాధికారులు తెలిపారు. కొన్ని హార్డ్ కాపీలు పాక్షికంగా దెబ్బతిన్నాయని, అయితే వాటి డిజిటల్ రికార్డులు అలాగే ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఛాంబర్‌లో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. సిబ్బంది తమ సాధారణ శనివారం పూజ కోసం నూనె దీపం వెలిగించి గది నుండి బయటకు వెళ్లారని, అయితే, ఆ దీపం ఒరిగిపోవడంతో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఛాంబర్‌లో పొగలు రావడాన్ని గమనించిన టీటీడీ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
టీటీడీ పరిపాలన భవనంలో అగ్నిప్రమాద ఘటన కలకలం రేపింది. దీని గురించి తెలిసి ఉన్నతాధికారులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక పలు ప్రభుత్వ కార్యాలయాల్లో వరుసగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పలు శాఖలకు చెందిన కీలక ఫైల్స్ మంటల్లో కాలిపోతున్నాయి. తాజాగా పోలవరం ప్రాజెక్ట్ కి చెందిన ఫైళ్లు కూడా దగ్ధమవడం సంచలనంగా మారింది. ప్రభుత్వ ఆఫీసుల్లో వరుస అగ్నిప్రమాదాలు, కీలక ఫైల్స్ మంటల్లో కాలిపోతుండటం.. పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ పరిస్థితుల్లో టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన అగ్నిప్రమాదయం అధికార యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
Also Read : టీడీపీతో టచ్‌లోకి వస్తున్న వైసీపీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు