భర్త వంట మెచ్చలేదని ఒంటిపై కిరోసిన్ పోసుకుని..

భర్త వంట మెచ్చలేదని ఒంటిపై కిరోసిన్ పోసుకుని..

Updated On : November 8, 2019 / 4:22 AM IST

తన చేతి వంటను మెచ్చుకోకుండా అది బాలేదని భర్త విమర్శించాడని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న యువతి 45రోజుల పాటు చావుబతుకుల మధ్య పోరాడి ప్రాణం కోల్పోయింది. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కామారెడ్డిగూడకు చెందిన రాఘవేంద్రచారికి కర్ణాటకలోని సేడం తాలూకా ఆర్కి గ్రామానికి చెందిన కవితతో రెండేళ్ల కిందట వివాహమైంది. 

నవంబరు 1న భర్త ‘నువ్వు వంట బాగా చేస్తలేదు’ అని భార్యతో అన్నాడు. మనస్తాపానికి గురైన యువతి మరుసటి రోజు తెల్లవారుజామున ఇంట్లోనే కిరోసిన పోసుకుని నిప్పంటించుకుంది. కుటుంబ సభ్యులు గమనించి కవితను చికిత్స నిమిత్తం వికారాబాద్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి మార్చారు. 

చికిత్స తీసుకుంటూనే గురువారం కవిత మృతి చెందినట్లు ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు. మృతురాలు కవిత 45రోజుల కిందట మగబిడ్డకు జన్మనిచ్చింది. వీరి వివాహమై రెండేళ్లవుతోంది. భార్యాభర్తలు బాగానే సంసారం చేస్తున్నారని, దసరా పండుగ నుంచి కవిత మానసిక పరిస్థితి సరిగా లేదని తల్లిదండ్రులు, ఆమె బంధువులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.