Husband Killed Wife : భర్తతో ఉండలేనన్న భార్య-బండరాయితో కొట్టి చంపిన భర్త
బానయ్యకు ఇద్దరు భార్యలు. 16 సంవత్సరాల క్రితం ఉప్పట్ల గ్రామానికి చెందిన రేణుకను రెండవ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు.

Husband Killed wife
Husband Killed Wife : పెద్దపల్లి జిల్లాలో కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్తను మంథని పోలీసులు అరెస్టు చేశారు. మంథని మండలం ఉప్పట్ల గ్రామంలో శనివారం భార్యను నడిరోడ్డుపై బండరాళ్లతో కిరాతకంగా కొట్టి చంపిన కాసిపేట బానయ్య అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
బానయ్యకు ఇద్దరు భార్యలు. 16 సంవత్సరాల క్రితం ఉప్పట్ల గ్రామానికి చెందిన రేణుకను రెండవ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు. భార్యా,భర్తల మధ్య కొన్ని సంవత్సరాలుగా గొడవలు జరగడంతో రేణుక జూలై నెలలో ఇంటి నుండి వెళ్లిపోవడంతో మంథని పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
మంథని పోలీసులు రేణుకను వెతికి తీసుకురాగా, ఆమె భర్తతోనే ఉంటానని పోలీసులకు చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. కొన్నాళ్లు ఇద్దరు బాగానే ఉన్నా… ఆమె ఎవరితో మాట్లాడినా, అనుమానంతో బానయ్య గొడవకు దిగేవాడు. దీంతో ఆమె మళ్లీ ఇంటి నుంచి వెళ్లిపోయి హైదరాబాదులో ఒక హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమెను వెతికి పట్టుకున్న బానయ్య…. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టుకుందాం రమ్మని కోరడంతో ఆమె తిరిగి ఇంటికి వచ్చింది.
Also Read : Gun Misfire : ట్రెజరీ ఆఫీసులో గన్ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ పరిస్థితి విషమం
శనివారం పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. ఆ పంచాయతీలో భర్తతో కలిసి ఉండలేనని రేణుక తేల్చి చెప్పింది. పంచాయతీలో మాటలు జరుగుతుండగానే ఆమె మధ్యలోనే తన కూతుర్ని తీసుకుని వెళ్లిపోయింది. వెళ్ళిపోతున్న రేణుకను వెంబడించిన బానయ్య నడిరోడ్డుపై బండరాయితో ఆమె తల మీద గట్టిగా కొట్టాడు. ఇంకా చావలేదని, మరొక రాయిని తీసుకుని గట్టిగా నాలుగైదు సార్లు తలపై క్రూరంగా కొట్టి చంపాడు.
బానయ్య కొట్టిన దెబ్బలకు ఘటనా స్ధలంలోనే రేణుక ప్రాణాలు విడిచింది. పట్టపగలే గ్రామంలో హత్య జరగటంతో గ్రామంలో కలకలం రేగింది. స్ధానికులు ఇచ్చిన సమాచారంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మృతురాలి కూతురు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంథని సీఐ సతీష్ తెలిపారు.