ఇద్దరు పెళ్లాలు చాలక మూడో పెళ్లికోసం యత్నాలు..చివరికి జైలు పాలు

శివరాం కు ఇద్దరు భార్యలు అయిదుగురు సంతానం. వీళ్లు చాలక మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగించాలనుకున్నాడు. మొదటి భార్య ఒప్పుకుంది. కానీ రెండో భార్య ఒప్పుకోలేదు. ఇదేమిటని ప్రశ్నించినందుకు కట్టుకున్న రెండో భార్యను అతి కిరాతకంగా హత్య చేసాడు. ఈ దారుణ సంఘటన కామారెడ్డిలో జరిగింది.
కామారెడ్డి జిల్లా ఎల్లా రెడ్డి పరిధిలోని సదాశివ నగర్ మండలం , సౌజ్య నాయక్ తండాకు చెందిన బానోత్ శివరాం కు ఇద్దరు భార్యలు. మొదటి భార్యను ఒప్పించి 20 ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన మేనక బాయి (40) అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.
అతనికి అంతకుముందే భార్య లిండిబాయి, కూతురు, కొడుకు ఉన్నారు. మేనకాబాయికి సైతం ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకు కరణ్ 8వ తరగతి, కూతురు భూమి 8వ తరగతి, చిన్న కొడుకు అర్జున్ 6వ తరగతి చదువుతున్నారు. పిల్లలను హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నాడు. ఇద్దరు భార్యలతో వేర్వేరుగా కాపురం పెట్టి సంసారం సాగించుకొస్తున్నాడు శివరాం.
అయితే శివరాం గత కొద్దికాలంగా వేరోక మహిళ మోజులో పడి ఆమెతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈవిషయం మొదటి భార్యకు తెలిసినా ఆమె పెద్దగా పట్టించుకోలేదు. కానీ రెండో భార్య మేనక భర్త శివరాం ను నిలదీసింది. దీంతో వారిద్దరిమధ్య తరచూ గొడవలు జరగటం మొదలైంది.
ఈ క్రమంలో మార్చి5 గురువారం రాత్రి మొగుడు పెళ్లాల మధ్య మరోసారి తీవ్ర స్ధాయిలో గొడవ జరిగింది. మరోక స్త్రీతో అక్రమ సంబంధం మానుకోవాలని మేనక భర్తతో గొడవపడింది. భార్య చెప్పే మాటలు నచ్చని శివరాం ఇంటిలోపల గడియ వేసి భార్యను కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. శివరాం కొట్టిన దెబ్బలకు మేనక అక్కడికక్కడే చనిపోయింది.
శుక్రవారం తెల్లవారు జామున ఇంటి పక్కవారు వెళ్లి తలుపులు తట్టగా శివరాం తలుపు తీసే సరికి భార్య మేనకాబాయి స్పృహతప్పి పడి ఉండడంతో వెంటనే స్థానికులు ఆమెను నిజామాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. స్ధానికులు తిరిగి మేనక మృతదేహాన్ని సజ్జనాయక్ తండాకు తీసుకువచ్చారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. మహారాష్ట్రకు చెందిన మేనకాబాయి కుటుంబ సభ్యులు తండాకు చేరుకొని శివరాం కోసం గాలించగా అతను తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. శివరాంపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ వెంకట్ తెలిపారు.