సోషల్ మీడియాలో వ్యక్తి పరిచయం-భార్యను నడిరోడ్డుపై నరికేసిన భర్త

Husband kills wife, due to illegal affair : సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తి కారణంగా కుటుంబంలో చిచ్చురేగింది. ఆరేళ్లుగా కాపురం చేస్తున్న భార్యా భర్తలు విడిపోయారు. పెద్దల సమక్షంలో విడిపోదామని భార్య నిర్ణయించుకుంది. కోపం పట్టలేని భర్త ప్రియుడితో బైక్ పై వెళుతున్న భార్యను కిరాతకంగా నరికి చంపాడు.
తూర్పు గోదావరి జిల్లా పెంటపాడు మండలంలో ఈ దారుణం జరిగింది. జిల్లాలోని గణపవరం మండలం చిలకం పాడుకు చెందిన దువ్వారపు చంటియ్యకు అదే మండలం మొయ్యేరుగ్రామానికి చెందిన చంద్రికతో ఆరేళ్లక్రితం వివాహాం అయ్యింది. పెళ్లై ఆరేళ్లైనా వీరికి పిల్లలు పుట్టలేదు.
ఉంగుటూరు మండలం గొల్లగూడెంకు చెందిన కొమ్ముజెర్సీ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చంద్రికకు పరిచయం అయ్యాడు. దీంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోచంద్రిక నాలుగు నెలల క్రితం భర్త నుంచి విడిపోయి వచ్చి సోషల్ మీడియా స్నేహితుడు జెర్సీతో కలిసి నివసిస్తోంది. దీంతో భార్యా భర్తల మధ్య మరింత దూరం పెరిగింది.
భర్తను వదిలేసి జెర్సీతో కలిసి నివసించాలని నిర్ణయించుకున్న చంద్రిక… ఈవిషయాన్నిపెద్దల సమక్షంలో సెటిల్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి గొల్లగూడెం నుంచి పెంటపాడు వైపు మోటార్ సైకిల్ పై బయలు దేరింది. దారి మధ్యలో భర్త చంటియ్య, మరో ఇద్దరితో కలిసి వారిని అడ్డగించాడు. ఆ సమయంలో వారి మధ్య ఘర్షణ జరిగింది. కోపం పట్టలేని భర్త తనతో తెచ్చుకున్నకత్తితో భార్య చంద్రిక మెడపై నరికాడు.
తీవ్రగాయాలైన చంద్రిక అక్కడి కక్కడే మృతిచెందింది. చంటియ్య అతనితోపాటు వచ్చిన మరో ఇద్దూర పరారయ్యారు. పెంటపాడు పోలీసులకు జెర్సీ సమాచారం అందించాడు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గొల్లగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.