ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్య

హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది, విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్న వేర్వేరు సంఘటనలు వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. కుషాయిగూడ పోలీస్టేషన్ పరిధిలో ఏఎస్ రావు నగర్ లో నివసించే డి.నాగేందర్ నారాయణ కళాశాలలో ఎం.పి.సి ప్రధమ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం వెలువడిన ఇంటర్ ఫలితాలు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు తాను ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందిన నాగేందర్ ఇంట్లో తన గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఈసీఐఎల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
మరోక సంఘటన మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మారేడ్ పల్లి రాయల్ నెక్స్ట్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న లాస్య అనే విద్యార్థిని ఈరోజు ఉదయం చున్నీతో ఉరివేసి కొని ఆత్మహత్యకు పాల్పడింది . ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదివిన లాస్య నిన్న విడుదలైన ఫలితాల్లో మ్యాథ్స్ పరీక్షలో ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్థాపానికి గురై శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. లాస్య మరణంతో వారి తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు.