శానిటరీ స్కాంపై విచారణ : అక్రమార్కుల వెన్నులో వణుకు

నకిలీ వేలి ముద్రలతో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన పారిశుధ్య కుంభకోణంపై జీహెచ్‌ఎంసీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు.

  • Published By: veegamteam ,Published On : February 1, 2019 / 06:05 PM IST
శానిటరీ స్కాంపై విచారణ : అక్రమార్కుల వెన్నులో వణుకు

Updated On : February 1, 2019 / 6:05 PM IST

నకిలీ వేలి ముద్రలతో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన పారిశుధ్య కుంభకోణంపై జీహెచ్‌ఎంసీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు.

హైదరాబాద్ : నకిలీ వేలి ముద్రలతో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన పారిశుధ్య కుంభకోణంపై జీహెచ్‌ఎంసీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 

కార్మికుల నకిలీ వేలిముద్రలతో జీహెచ్‌ఎంసీ  పారిశుధ్య కాంట్రాక్టర్లు నగరపాలక సంస్థ ఖజానా నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. విజిలెన్స్‌ అధికారుల తనిఖీల్లో బయటపడిన ఈ వ్యవహారంపై విజిలెన్స్‌ అధికారులు చేపట్టిన సమగ్ర విచారణ  వేగం పంజుకోవడంతో అక్రమార్కుల వెన్నులో వణుకుపుడుతోంది. 

జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎల్బీ నగర్‌, కూకట్‌పల్లి, చార్మినార్‌ సర్కిళ్లలో సింథటిక్‌ ఫింగర్‌ ప్రింట్స్‌తో పారిశుధ్య కార్మికుల హాజరీ సృష్టించిన  కాంట్రాక్టర్ల బండారం విజిలెన్స్‌ తనిఖీల్లో బయటపడింది. పదిహేడు మంది పారిశుధ్య క్షేత్ర సహాయకులను విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. తొమ్మిది మంది ఎస్‌ఎఫ్‌ఏల  నుంచి 84 నకిలీ వేలిముద్రలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎంతమంది శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు ఈ విధంగా చేస్తున్నారన్న అంశంపై విచారణ జరుపుతున్నారు. 

శానిటరీ కుంభకోణంలో జీహెచ్‌ఎంసీ అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. చార్మినార్‌, సెంట్రల్‌ జోన్ల పరిధిలో ఇద్దరు సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్లు ఈ కుంభకోణంలో పాత్రధారులుగా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. విజిలెన్స్‌ తనిఖీల తర్వాత పారిశుధ్య కార్మికుల హాజరీలో భారీగా మార్పు వచ్చినట్టు జీహెచ్‌ఎంసీ గుర్తించింది. రోజువారీ హాజరీని పరిశీలిస్తే 1300 మంది కార్మికులు తగ్గినట్టు తేలింది. లోతుగా విచారిస్తే ఇలాంటి మరిన్ని అక్రమాలకు చెక్‌ పెట్టొచ్చని జీహెచ్‌ఎంసీ అధికారులు భావిస్తున్నారు. 

మరోవైపు శానిటరీ కుంభకోణంపై జరుగుతున్న విచారణను ప్రభావితం చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని వినిపిస్తోంది. విజిలెన్స్‌ విచారణలో అక్రమార్కులను బయటపెడతారా.. లేక గతంలో మాదిరిగా మమా.. అనిపిస్తారో చూడాలి.